రియల్ ఎస్టేట్ గురుతో
వాసవి గ్రూప్ సీఎండీ వైవీకే
హైదరాబాద్.. గ్లోబల్ సిటీ
ప్రపంచ నగరాలతోనే పోటీ
భవిష్యత్తు అభివృద్ధిలో మేటి
రియాల్టీని ప్రోత్సాహాకాలు కావాలి
(కింగ్ జాన్సన్ కొయ్యడ, 9030034591)
హైదరాబాద్ జనాభా సుమారు 1.25 కోట్ల దాకా ఉంటే.. అమరావతి జనాభా 20 లక్షలు ఉంటుందేమో.. ఈ క్రమంలో అమరావతి భాగ్యనగరం స్థాయికి చేరాలంటే ఎంత సమయం పడుతుందో వాస్తవికంగా ఆలోచించాలి. పైగా, హైదరాబాద్ రాత్రికి రాత్రే డెవలప్ అవ్వలేదు. ఇందుకోసం యాభై ఏళ్లు పట్టింది. ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతలేదన్నా ముప్పయ్యేళ్లు పట్టింది. ప్రభుత్వాలన్నీ కలిసి కట్టుగా పని చేస్తేనే.. హైదరాబాద్ మహానగరంగా అవతరించింది. గ్లోబల్ సిటీగా ఖ్యాతినార్జించింది. కాబట్టి, ఏపీలో అమరావతి రాజధానిగా ఏర్పడినా.. హైదరాబాద్ రియాల్టీ మీద ప్రతికూల ప్రభావం పడే ఆస్కారమే లేదని వాసవి గ్రూప్ సీఎండీ ఎర్రం విజయ్ కుమార్ అన్నారు. ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతితో పాటు ఏపీని అభివృద్ధి చేయగల సత్తా ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి ఉందన్నారు. అమరావతికి అవసరమయ్యే సపోర్టును అందజేస్తామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో.. సారాంశం విజయ్ కుమార్ మాటల్లోనే…
అమరావతి ఏర్పడుతుందని తెలియగానే కొంతమంది ఇన్వెస్టర్లకు అక్కడికి వెళతారు. పుట్టిన ఊరు మీద మమకారంతోనో.. లేక తమ సొంత రాజధానిలో ఒక ఇల్లు అయినా ఉండాలనే ప్రేమతోనే అక్కడ ప్లాట్లు కొనేవారుంటారు. అది ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే, దాన్ని వల్ల హైదరాబాద్‌కు వచ్చే నష్టమేం ఉండదు. ఎందుకంటే, రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడైనా పెట్టొచ్చు. ఇక్కడే ఉన్న వారిలో చాలామందికి ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో పెట్టుబడి పెడతారు. లాభాలు రాగానే అమ్మేసుకుంటారు. అదేవిధంగా, కొంతమంది అమరావతిలోనూ పెట్టుబడి పెట్టొచ్చు. కాకపోతే, దాని వల్ల హైదరాబాద్ రియాల్టీ మార్కెట్ మీద ప్రతికూల ప్రభావం పడుతుందనేది కరెక్టు కాదు. ఎందుకంటే, ఈ నగరం రాత్రికిరాత్రే డెవలప్ అవ్వలేదు. ఐదేళ్లకో, పదేళ్లకో ఐటీ రంగం వృద్ధి చెందలేదు. దీని వల్ల సుమారు యాభై ఏళ్ల కృషి ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కృషి చేస్తేనే హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరంగా.. ప్రపంచంలోనే టాప్ సిటీగా అవతరించింది.
సాధారణంగా హైదరాబాద్‌లో ఏటా సుమారు నలభై వేల ఫ్లాట్లు అమ్ముడవుతుంటాయి. మార్కెట్ మెరుగ్గా ఉన్నప్పుడు ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. మరి, అమరావతిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెంది, బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాలు, వాణిజ్య సముదాయాలు రావడానికి కొంత సమయం పడుతుంది. మరి, అక్కడ ఏటా ఎన్ని ఫ్లాట్లు అమ్ముడవుతాయో తెలియడానికి ఇంకొంత సమయం పడుతుంది. అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ముందుగా మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడంపై ఫోకస్ పెడుతుందని అనుకుంటున్నాను.
ఫోకస్ మారుతుందిక
దేశంలో ఎన్నికలు పూర్తి కావడంతో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెడుతుంది. మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయాలి. పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, ఐటీ సంస్థలకు ప్రోత్సాహాకాల్ని అందించాలి. సీఎం రేవంత్ రెడ్డి రియాల్టీ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కావడం వల్ల.. రియల్ ఎస్టేట్ రంగానికి అవసరమయ్యే ప్రోత్సాహాకాల గురించి తెలుసు. కాబట్టి, రానున్న రోజుల్లో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయే విధంగా.. ఆయన నిర్ణయాలు తీసుకుంటారనే నమ్మకమైతే మాకుంది. మురికిమూసీని సుజలరాశిగా చేసేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. ఐటీ కంపెనీలు, రియాల్టీ ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నారు. ఐటీ దిగ్గజాల్ని కలుస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం గాడిలో పడితే.. దానిపై ఆధారపడ్డ 250 పరిశ్రమలు కళకళలాడుతాయి. ఎందుకంటే, వ్యవసాయం తర్వాత అధిక శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తున్నదీ రంగమే. కాబట్టి, ప్రభుత్వం డెవలప్‌మెంట్ మీద ఫోకస్ పెడుతుందనే నమ్మకమైతే ఉంది.
అంతర్జాతీయ నగరాల సరసన నిలబడేలా హైదరాబాద్ నగరం డెవలప్ అయ్యేందుకు ప్రధాన కారణమేమిటంటే.. అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ.. రాజకీయాలు పక్కన పెట్టి.. గత ప్రభుత్వాల ప్రతిపాదనల్ని ముందుకు తీసుకెళ్లాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి విషయంలో నిర్ణయాల్ని తీసుకున్నాయి. అందుకే, ఈ నగరమీ స్థాయికి చేరింది. ప్రస్తుత ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాను. మార్కెట్లో ఉన్న నగదు కొరత క్రమక్రమంగా తీరిపోతుంది. ఆచితూచి అడుగేసే బ్యాంకులు ఇప్పుడు నిర్మాణ రంగానికి రుణాలు విరివిగా మంజూరు చేస్తాయి. మాకు బ్యాంకులన్నీ ఎనలేని సహకారాన్ని అందిస్తున్నాయి. ఈ విషయంలో ఎస్‌బీఐ బ్యాంకుకు కృతజ్ఞతలు చెబుతున్నాను.
లేఅవుట్లు.. ప్రాజెక్టులెన్నీ?
ప్రస్తుతం హైదరాబాద్‌లో 250 ఎకరాల్లో మూడు లేవుట్లను డెవలప్ చేస్తున్నాం. ఇందులో ఎంతలేదన్నా మూడు వేల ప్లాట్లు దాకా వస్తాయి. ఇవి ఈ ఏడాది పూర్తవుతాయి. ఐదు మిలియన్ చదరపు అడుగుల్లో రెండు కమర్షియల్ ప్రాజెక్టుల్ని ఆరంభించాం. ఇందులో మూడు మిలియన్ చదరపు అడుగుల్ని ఈ ఏడాది డెలివరి చేస్తాం. మిగతా రెండు మిలియన్లు వచ్చే ఏడాది అందజేస్తాం. ఇక రెసిడెన్షియల్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. నగరం చుట్టూ పన్నెండు రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నాం. వీటిని దాదాపు వంద ఎకరాల్లో.. 20 మిలియన్ చదరపు అడుగుల్లో కడుతున్నాం. ఇందులో ఆరు ప్రాజెక్టుల్ని రెండేళ్లలో పూర్తి చేస్తాం. మూడు ప్రాజెక్టులు ఈ ఏడాది, మరో మూడు ప్రాజెక్టుల్ని వచ్చే ఏడాదిలోపు హ్యాండోవర్ చేస్తాం. నెలకు ఎంతలేదన్నా 150 నుంచి 200 ఫ్లాట్ల దాకా విక్రయిస్తున్నాం. ఎక్కువగా మధ్యతరగతికి అవసరమయ్యే ప్రాజెక్టుల్ని నిర్మిస్తాం కాబట్టి.. గిరాకీ ఎప్పటికీ ఉండనే ఉంటుంది.