తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఆదాయ మార్గాలను పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను పెంచాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన రెవెన్యూ , స్టాంపులు-రిజిష్ట్రేన్ల శాఖలు ధరలు నిర్ణయించే పనిలో ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో భూములు, స్థిరాస్తి విలువలను అంచనా వేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. పాత విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇతర స్థిరాస్తుల మార్కెట్ విలువలను 30 నుంచి 60 శాతం మేర పెంచాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. భూములు, స్ఖిరాస్తుల విలువలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు సైతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 7.5 గా ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీ.. మరో 0.5 నుంచి ఒక శాతం పెరిగే అవకాశం ఉంది.