ప్రాజెక్టును నిర్ణీత సమయంలోగా రిజిస్టర్ చేయని కారణంగా ఓ నిర్మాణ సంస్థపై రెరా కన్నెర్రజేసింది. వాటికా లిమిటెడ్ అనే సంస్థకు హర్యానా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీ ఏకంగా రూ.5 కోట్ల జరిమానా విధించింది. రెరా చట్టంలోని సెక్షన్ 3 (1) ను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్టు పేర్కొంది. వాటికా ఇండియా నెక్ట్స్ అనే ప్రాజెక్టు కోసం 2013లో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ నుంచి అనుమతి తీసుకుంది. 2017లో రెరా చట్టం వచ్చిన తర్వాత మూడు నెలల్లోగా రెరా రిజిస్ట్రేషన్ కోసం ప్రమోటర్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
కానీ వాటికా లిమిటెడ్ అలా చేయలేదు. చివరకు 2022లో రెరా సుమోటోగా చర్య తీసుకోవడంతో అప్పుడు వాటికా లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసింది. ఈ నేపథ్యంలో నిర్ణీత గడువులోగా ఆ సంస్థ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయనందున రెరా చట్టం ప్రకారం వాటికా లిమిటెడ్ కు రూ.5 కోట్ల జరిమానా విధించినట్టు హెచ్ రెరా చైర్మన్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.