హైదరాబాద్లో పెట్రేగిపోతున్న ప్రీ లాంచ్ ప్రాజెక్టులపై తెలంగాణ రెరా అథారిటీ (RERA AUTHORITY of Telangana) కన్నెర్ర చేసింది. రెరా అథారిటీ అనుమతి తీసుకోకుండా.. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ ల ద్వారా ప్రీ లాంచ్ ప్రాజెక్టుల సమాచారాన్ని సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెరా అథారిటీ మరో ముందడుగు వేసింది. తక్కువ రేటంటూ అమాయక కొనుగోలుదార్నుంచి ముందే వంద శాతం సొమ్మును వసూలు చేస్తున్న పలు సంస్థలకు షోకాజ్ నోటీసుల్ని పంపింది.
ఆయా సమాచారాన్ని అందుకున్న కొన్ని కంపెనీలు రెరా అథారిటీకి జవాబునిచ్చాయి. ఈ క్రమంలో, రెరా షోకాజ్ నోటీసుల్ని సీరియస్ గా తీసుకోని కంపెనీలపై జరిమానా విధించేందుకు అథారిటీ సమాయత్తం అవుతుంది. ప్రాజెక్టు విలువలో మొత్తం పది శాతం జరిమానాను లెక్కించే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆయా ప్రాజెక్టుల్ని సందర్శించి జరిమానాను నిర్థారిస్తుంది. దీనికి సంబంధించిన తుది వివరాల్ని రెరా అథారిటీ వెల్లడించే అవకాశముంది.