కోకాపేట్ వేలం కంటే ముందు నుంచే హైదరాబాద్ రియల్ రంగంలో హై ఎండ్ ఫ్లాట్లకు మంచి గిరాకీ పెరిగిందని.. ఊహించిన దానికంటే అధిక స్థాయిలో అమ్మకాలు పుంజుకున్నాయని శ్రీ శ్రీనివాసా కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్టనర్ వి.కృష్ణారెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో కోకాపేట్ అతివేగంగా అభివృద్ధి చెందుతుందని.. అందుకే, అధిక శాతం మంది ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని వివరించారు. హైదరాబాద్ రియల్ రంగం తాజా పరిస్థితులు.. తాము చేపడుతున్న ప్రాజెక్టుల గురించి ఆయన రియల్ ఎస్టేట్ గురుకి ప్రత్యేకంగా వివరించారు. సారాంశం కృష్ణారెడ్డి మాటాల్లోనే..
”కరోనాతో సంబంధం లేకుండా హైదరాబాద్‌లో లగ్జరీ ఫ్లాట్లకు గిరాకీ పెరుగుతోంది. అసలు దేశంలోనే ఇలాంటి సానుకూల పరిస్థితి ఎక్కడా లేదు. ఇలాంటి అనుకూలమైన వాతావరణం కేవలం మన రియల్ రంగంలోనే కొనసాగుతోంది. రెండు, మూడేళ్లలో మా ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ.. వ్యాపారులు, వృత్తినిపుణులు వంటివారు ఎక్కువగా ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ లొకేషన్, పర్‌ఫెక్ట్ ప్లానింగ్, నిర్మాణాన్ని పక్కాగా పూర్తి చేసే బిల్డర్ అయితే చాలు.. కొనుగోలుదారులు ఫ్లాట్లను కొంటున్నారు. మేం 2004 నుంచి హైదరాబాద్ నిర్మాణ రంగంలో ప్రాజెక్టుల్ని చేస్తున్నాం. ఇప్పటివరకూ దాదాపు పదిహేను ప్రాజెక్టుల్ని పూర్తి చేశాం. 50 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేశాం. ఇంతటి ఘనమైన ట్రాక్ రికార్డు ఉండటం వల్లే మేం ఎక్కడ ప్రాజెక్టుల్ని ఆరంభించినా.. కొనుగోలుదారులు మా ప్రాజెక్టుల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. పైగా, మేం కట్టేవాటిలో ఎక్కువ లగ్జరీ గృహాలే ఉండటం గమనార్హం.
* కోకాపేట్ వేలం కంటే ముందే అక్కడి చుట్టుపక్కల ఏరియాల్లో గిరాకీ అనూహ్యంగా పెరిగింది. కరోనా వల్ల ఒకవైపు ఇతర రంగాలు దెబ్బతిన్నప్పటికీ.. ఆ ప్రభావం రియల్ మార్కెట్ మీద పెద్దగా పడలేదని చెప్పొచ్చు. కరోనా మొదటి వేవ్ పూర్తయ్యాక.. కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు చదరపు అడుక్కీ రూ.1000 నుంచి 1500 దాకా పెరిగాయి. కొత్త, పాత అనే అంశంతో సంబంధం లేకుండా అన్ని ప్రాజెక్టుల్లో రేట్లు పెరిగాయి. కుటుంబానికి, పిల్లల భద్రతకు భరోసా ఉంటుందనే ఏకైక కారణంతో చాలామంది ఫ్లాట్లను కొనుగోలు చేశారని చెప్పొచ్చు.
నాలుగు ప్రాజెక్టులు..
ప్రస్తుతం మేం హైదరాబాద్‌లో నాలుగు లగ్జరీ ప్రాజెక్టుల్ని చేస్తున్నాం. రాజ్‌భవన్ రోడ్డులో స్కై సిటీ, బంజారాహిల్స్‌లో ఫార్చ్యూన్ వన్, కోకాపేట్‌లో స్కై విల్లాస్, మోకిలాలో విల్లాస్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ కూడా లగ్జరీ ప్రాజెక్టులే. హై ఎండ్ ఫ్లాట్ల విభాగంలో పునాది స్థాయిలోనే ఫ్లాట్లు అమ్ముడవుతున్నాయి. కోకాపేట్‌లో ఫౌండేషన్ స్టేజీలో ఉన్నప్పటికీ 70 శాతం ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. మోకిలలో లగ్జరీ విల్లా ప్రాజెక్టుకు అనుమతులొచ్చేశాయి. 70 శాతం విల్లాల్ని విక్రయించాం. ఫ్యూచరిస్టిక్ లొకేషన్తో బాటు బిల్డర్ క్రెడిబిలిటీని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. నమ్మకం కుదిరితే చాలు తక్షణమే కొనేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 40 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నాం. వీటిని వచ్చే రెండు, మూడేళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం.
40 అంతస్తుల నయా ప్రాజెక్టు..
మేం ఎక్కడ నిర్మాణం ప్రారంభించినా నాణ్యత మీద దృష్టి పెడతాం. భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల్ని ఎంపిక చేసుకోవడం వల్ల బయ్యర్లు మా ప్రాజెక్టులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఉదాహరణకు, గచ్చిబౌలి ఓఆర్ఆర్ టోల్ గేటు పక్కన 10 ఎకరాల్లో.. 40 అంతస్తుల ఆకాశహర్మ్యం ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నాం. డీఎస్సార్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ రఘురాంరెడ్డితో కలిసి ఈ ప్రాజెక్టులో 40 లక్షల చదరపు అడుగుల్ని అభివృద్ధి చేస్తున్నాం. మరో మూడు నెలల్లో ఈ ప్రాజెక్టుకు ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం”.