poulomi avante poulomi avante

విశ్వ‌న‌గ‌రానికి ప‌దివేల కోట్లు!

  • మెట్రో రైల్ విస్తరణకు సమగ్ర ప్రాణాళిక
  • ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు
  • మూసీ ప్రక్షాళణ, సుందరీకరణకు డీపీఆర్
  • జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతులు

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈమ‌ధ్య అసెంబ్లీలో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి.. భాగ్యనగర అభివృద్దికి రూ. 10 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారు. బడ్జెట్ లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్, హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అధారిటీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు 1500 కోట్లు, రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు 1,525 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు 500 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ 3,385 కోట్లు, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైల్ విస్తరణకు 100 కోట్లు, హైడ్రా సంస్థకు 200 కోట్ల రూపాయల మేర నిధులను కేటాయించింది.

హైదరాబాద్లో ఉద్యోగ, ఉపాధి పొందుతున్నవారికి, కార్యాలయాలకు దగ్గరగా, నగరం చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ టౌన్‌షిప్ లలో పేద, మధ్యతరగతి వారికి అందరికి అందుబాటు ధరల్లో, అన్ని రకాల మౌలిక వసతులతో నివాస గృహాల నిర్మాణాలను అందించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నగరంలో పలు ఇతర వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు.. నగరంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మెట్రో రైల్ విస్తరణ చేపడతామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. 78.4 కిలో మీటర్ల పొడవున్న 5 అదనపు మెట్రో కారిడార్లను 24,042 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మెట్రో రైలును ఓల్డ్ సిటీ వరకు పొడిగించి దానిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు అనుసంధానం చేయనున్నారు.

మరోవైపు నాగోలు నుంచి ఎల్.బి.నగర్ వరకు మెట్రోను విస్తరించేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది ప్రభుత్వం. నాగోలు, ఎల్.బి నగర్, చంద్రాయణగుట్ట మెట్రో స్టేషన్లను ఇంటర్ ఛేంజ్ స్టేషన్లగా అభివృద్ధి చేయనున్నారు. ఎల్.బి.నగర్ నుంచి హయత్ నగర్ వరకు, మియాపూర్ నుంచి పటాన్ చెరువుకు, మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్ ను సిద్దం చేస్తోంది. ఇక హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వరకు గల ప్రాంతాలను కోర్ అర్బన్ రీజియన్‌గా గుర్తించడంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అంతేకాదు ఔటర్ రింగు రోడ్డును హైదరాబాద్ మెట్రో సిటీ సరిహద్దుగా పరిగణించేలా చర్యలు చేపడుతోంది రేవంత్ సర్కార్.
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో విపత్తుల నిర్వహణకు ఒక ఏకీకృత సంస్థ ఏర్పాటు చేసి, జీహెచ్‌ఎంసీ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాలు దీని పరిధిలోకి తెచ్చేలా సమగ్ర ప్రణాళికలు సిద్దం చేస్తోంది ప్రభుత్వం. ఈ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యత హైదరాబాద్ విపత్తు నివారణ, ఆస్తుల పరిరక్షణ సంస్థ (హైడ్రా) కు అప్పగించనున్నారు. ఇక మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతాన్ని అభివృద్ది చేసి, నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య, నివాస కేంద్రాలను ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు పాత హెరిటేజ్ ప్రాంతాలకు కొత్త సొబగులు అద్దాలని తెలంగాణ సర్కార్ సమాయుత్తం అవుతోంది.
లండన్ లోని థేమ్స్ నదీ తరహాలో మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధి, పరివాహక ప్రాంతాల సుందరీకరణకు సంబందించిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు మొదటి దశలో 1,500 కోట్ల రూపాయలు ప్ర‌భుత్వం కేటాయించింది. మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్‌లు, పెడిస్ట్రియన్ జోన్‌లు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లు, పీపుల్స్ ప్లాజాల అభివృద్ధి చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిప‌ల్‌ కార్పోరేషన్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్లు కేటాయించారు. హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి 500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్‌కి 3,385 కోట్ల రూపాయలను బడ్జెట్ లో ప్రతిపాదించింది.
ఇక శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్ విస్తరణకు బడ్జెట్ లో 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కోసం 200 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకి 500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకి 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ కోసం మరో 50 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ప్ర‌భుత్వం కేటాయించింది. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర ప్రాంతంలోని సంగారెడ్డి- తూప్రాన్ – గజ్వేల్ – చౌటుప్పల్ 158.6 కిలో మీటర్ల రోడ్డును, దక్షిణ ప్రాంతంలోని చౌటుప్పల్ -షాద్ నగర్-సంగారెడ్డి 189 కి.మీ.ల పొడవున్న రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ట్రిపుల్ ఆర్ ను ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా మొదటి దశలో నాలుగు లేన్లతో నిర్మించి.. ఆ త‌ర్వాత‌ దానిని ఎనిమిది లేన్ల సామర్థ్యానికి విస్తరించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర ప్రాంత అభివృద్ధికి ప్రాథమిక అంచనాల ప్రకారం 13,522 కోట్లు, దక్షిణ ప్రాంతాభివృద్ధికి సుమారు 12,980 కోట్లు ఖర్చు చేయాలని రేవంత్ సర్కార్ అంచనాకు వచ్చింది. ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ కోసం బడ్జెట్‌లో ప్రస్తుతం 1525 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ చారిత్రాత్మక నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ది చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది రేవంత్ సర్కార్.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles