- ప్రపంచ అవసరాలు తీర్చే ఫ్యూచర్ సిటీగా ఫోర్త్ సిటీ
- కాగ్నిజెంట్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి
- ఫ్యూచర్ సిటీలో కాగ్నిజెంట్‌కు ఆహ్వానం
తమ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని ప్రపంచంతోనే తమ పోటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలపాలనేది తమ సంకల్పమని ముఖ్యమంత్రి తెలిపారు. కోకాపేటలో కాగ్నిజెంట్ నూతన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 430 సంవత్సరాల చరిత్ర హైదరాబాద్ కు ఉందని, నగర స్థాపకుడు కులీకుతుబ్ షా నుంచి తన వరకు ఎవరు పాలించినా, ఎన్ని వ్యవస్థలు మారినా విధానాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారగానే ఇక్కడి నుంచి పెట్టుబడులు అక్కడి తరలిపోతాయనే చర్చను కొందరు ప్రారంభించారని..
కానీ తన పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదని ప్రపంచంతోనేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం, దేశంలోనే అత్యధికంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించే కాగ్నిజెంట్ తమ దగ్గర ఉందన్నారు. కుతుబ్ షాహీలు, నిజాంలు హైదరాబాద్‌ను నిర్మిస్తే… బ్రిటిషర్స్ సికింద్రాబాద్‌ను నిర్మించారని, 1992లో ఐటీ పరిశ్రమలకు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసి సైబరాబాద్‌ను నిర్మించారని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లు తాము నాలుగో నగరం ఫ్యూచర్ సిటీ నిర్మించాలనుకుంటన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. చైనా ప్లస్ 1 కంట్రీ కోసం అమెరికా, సౌత్ కొరియా ఇతర దేశాలు ఏవైతే ఎదురు చూస్తున్నాయో… వాటన్నింటి ప్రశ్నలకు ఆ ఫ్యూచర్ సిటీ సమాధానం చెబుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తమ చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూపిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.
త్వరలోనే మరిన్ని ఒప్పందాలు..
అమెరికా, దక్షిణ కొరియాల్లో పది రోజుల పర్యటన తర్వాత తాను ఈ రోజే తిరిగి వచ్చానని, అక్కడ తాము కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్ ల్లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తమ పర్యటనల ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనుట్లు ముఖ్యమంత్రి చెప్పారు. పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.
తెలంగాణకు మూడు రింగ్స్ ఉన్నాయని, మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్ అని, రెండోది అవుటర్ రింగు రోడ్డు-రీజినల్ రింగు రోడ్డు మధ్యన గల సెమీ-అర్బన్ ఏరియా అని, అక్కడ తాము తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణ, అక్కడ అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. పక్క రాష్ట్రాలతో పోటీ పడడం నుంచి ప్రపంచంతో పోటీ పడేందుకు తమ ఆలోచనను ఎప్పుడో విస్తరించుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు…
కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. హైదరాబాద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందిందని ముఖ్యమంత్రి అన్నారు. 2002లో హైదరాబాద్ లో ప్రారంభమైన కాగ్నిజెంట్ లక్ష మందికి ఉద్యోగాలు కల్పించేలా ఎదిగిందన్నారు. ఫ్యూచర్ సిటీలోనూ కాగ్నిజెంట్ ప్రాంగణం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. తెలంగాణ యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు.
ప్రతి ఒక్కరూ హైదరాబాద్
గురించి మాట్లాడుతున్నారు… మంత్రి శ్రీధర్ బాబు
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ రోజు హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఒక్క రోజులోనే ఇక్కడ ఐటీ రంగం అభివృద్ధి చెందలేదని, 1992లో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఐటీ పరిశ్రమలకు శంకస్థాపన చేస్తే తర్వాత పదేళ్లు పాలించినా మరో పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, ఆ తర్వాత పదేళ్లు పాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇక్కడ ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేశారని తెలిపారు. దావోస్ పర్యటనలో తాము కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కాగ్నిజెంట్ అమెరికస్ ప్రెసిడెంట్, ఈవీపీ సూర్య గుమ్మడితో క్యాంపస్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారని ఆయన గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించి ఆరు నెలల కాలంలోనే ఇక్కడ క్యాంపస్ విస్తరణ పూర్తి చేసి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచం నేడు ఏఐ,సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ వంటి విభిన్న రకాల ప్రతిభను అన్వేషిస్తోందన్నారు. అందుకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల వసతులను కల్పించేందుకు తమ ముఖ్యమంత్రి దృష్టిసారించారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ క్రమంలోనే తాము ఏఐ సిటీ నిర్మించాలనుకుంటున్నట్లు వివరించారు.
హైదరాబాద్‌లో మా నెట్వర్క్‌లో కీలకమైన హబ్:
సూర్య గుమ్మడి, కాగ్నిజెంట్ ఈవీపీ ప్రెసిడెంట్
తమ నెట్వర్క్‌లో హైదరాబాద్ కీలకమైన హబ్ అని కాగ్నిజెంట్ ఈవీపీ, కాగ్నిజెంట్ అమెరికస్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి తెలిపారు. కాగ్నిజెంట్ నూతన ప్రాంగణం ప్రారంభం అనంతరం సూర్య గుమ్మడి మాట్లాడుతూ 2002 నుంచి కాగ్నిజెంట్ అభివృద్ధిలో కీలకమైన హైదరాబాద్‌లో నూతన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేంద్రాన్ని ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్‌కు 3.46 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో భారతదేశంలో 2.40 లక్షల మంది, వారిలో 57 వేల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని వెల్లడించారు.
ఇందులో 39 శాతం మంది మహిళలేనని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌తో తమది వ్యూహాత్మకమైన పెట్టుబడి అని, స్థానికంగా ప్రతిభావంతులైన యువతకు ఉపాధి కల్పిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఏఐ, ఎంఎల్, డేటా ఇంజినీరింగ్, ఐవోటీలో కట్టింగ్ ఎడ్జ్ సమస్యలకు తమ హైదరాబాద్ కేంద్రం పరిష్కారం చూపిస్తుందని సూర్య తెలిపారు. తెలంగాణలో విద్యా, నైపుణ్య శిక్షణ, సమాజ సంక్షేమం, పర్యావరణ సుస్థిరాభివృద్ధికి తాము కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. హైదరాబాద్‌తో తమ నూతన విస్తరణకు సహకరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూర్య గుమ్మడి కృతజ్ఞతలు తెలిపారు. కాగ్నిజెంట్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఉందని, నైపుణ్యాభివృద్ధి, ప్రతిభను ప్రోత్సహించడం, సాంకేతికత, ఆవిష్కరణల విషయంలో కాగ్నిజెంట్ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.