poulomi avante poulomi avante

హైడ్రా టార్గెట్‌.. మొయినాబాద్‌

ల‌క్ష్యం.. 111 జీవోలోని అక్ర‌మ నిర్మాణాలేనా?

ఎన్ని కూల్చేస్తారు? ఎన్ని ఆపేస్తారు?

చెరువుల పరిరక్షణ.. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వరకే అని మొదట్లో అన్నది రేవంత్‌ సర్కార్‌. కానీ ట్రిపుల్‌ వన్ జీవో పరిధిలోని ట్విన్ రిజర్వాయర్స్ పరీవాహక ప్రాంతంలో సింహభాగం ఓఆర్ఆర్‌ అవతల ఉంది. విచ్చలవిడి అక్రమ కట్టడాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి ట్రిపుల్‌ వన్ జీవో పరిధిలోని అనేక ప్రాంతాలు. ఇప్పుడు ఈ కట్టడాలపై హైడ్రా కన్ను పడింది. అందుకే హైడ్రా పరిధిని హద్దులు దాటించాలని ప్రభుత్వం ఫిక్స్‌ అయ్యింది.

దానికి తగ్గట్టే నెక్ట్స్‌ స్పాట్‌ పడబోయేది వీటికే అని ఓ లిస్ట్‌ సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ అవుతోంది. అంతేకాదు కూల్చివేతలకు సంబంధించిన నోటీస్‌ల విషయంలో హైడ్రాకి ఫ్రీ హ్యాండ్‌ ఇవ్వాలని డిసెడైంది ప్రభుత్వం. నోటీసులు పేరు చెప్పి హైడ్రా పనులను అడ్డుకోవాలని చూసే వారి ఎత్తులకు చెక్‌ పెట్టేస్తూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసే అధికార‌మూ ఆ సంస్థకే కట్టబెట్టాలని నిర్ణయించింది.

వీకెండ్‌ వచ్చింది. కూల్చివేతలకు మరోసారి ముహుర్తం సెట్‌ చేస్తున్నట్టు ఉన్నారు హైడ్రా అధికారులు. బుల్డోజర్లు ఈ సారి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ దాటి ట్రిపుల్‌ వన్ జీవో పరిధిలో వెల‌సిన అక్రమ నిర్మాణాల వైపు దూసుకెళ్లడానికి సరంజామా రెడీ చేసుకుంటున్నాయనే ప్రచారాలు జోరుగా సాగుతున్నాయ్‌. నెక్ట్స్‌ స్టాప్‌ మొయినాబాదే కావచ్చనే ఊహగానాలకు కొదువ లేదు. మొయినాబాద్‌ మండలంలోని వివిధ గ్రామ పంచాయితీల పరిధిలో ఉన్న 46 నిర్మాణాలు.. ఎన్ని ఎకరాల్లో అవి విస్తరించాయో.. వాటి సర్వే నంబర్లతో సహా లిస్ట్‌ ఔట్‌ చేసిన జాబితా ఒకటి సోషల్‌ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అవుతుండటమే ఇలాంటి ప్రచారాలకు కారణం. నాలుగు టీమ్‌లుగా డివైడ్ చేసిన‌ ఈ లిస్ట్‌లో ఉన్న వివ‌రాల్ని చూస్తే టార్గెట్‌ పెద్దగానే ఉన్నట్టు ఉంది.

క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న ఫినిష్‌..

ఇప్పటికే మున్సిపల్‌, రెవిన్యూ అధికారులు శంషాబాద్‌ మున్సిపాల్టీ పరిధిలోని కిషన్‌గూడ, రాళ్లగూడ, బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కొన్ని కాలనీలు.. మొయినాబాద్‌ పరిధిలోని చిల్కూరు, సురంగల్‌, కనకమామిడి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై సమాచారాన్ని సేకరించారనే ప్రచారం జరుగుతోంది. శంషాబాద్‌ మున్సిపాల్టీ, బండ్లగూడ జాగీర్, మొయినాబాద్‌ మండలాల్లో అనుమతుల్లేని నిర్మాణాల లెక్కింపుకు క్షేత్రస్థాయిలో పర్యటించి లెక్కలు తీస్తున్నారని.. అసలు అనుమతులు పొందారా..! వస్తే ఆ అనుమతుల్ని ఎక్కడ నుంచి తీసుకున్నారు..? ఎలా తీసుకున్నారు..? అనే వివరాలు కూపీ లాగి వాటిని ఏం చేయాలనే నిర్ణయానికి రానున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

జాబితా ప్రకారం చూస్తే- మొయినాబాద్‌లోని వివిధ గ్రామ పంచాయితీల పరిధుల్లో వ్యక్తులు.. సంస్థల ఖాతాలో ఎకరాలకెకరాలు ఉన్నాయ్‌. వాటిలో నెక్ట్స్‌ కూలబోయేవి ఇవే అంటూ ప్రచారమవుతోన్న నిర్మాణాల లిస్ట్‌లో- మొయినాబాద్‌ హిమాయత్‌నగర్ గ్రామపంచాయితీలో శ్రీనివాస పద్మావతి డెవలపర్స్‌ 17 ఎకరాలు, డ్రీమ్‌వ్యాలీ య‌జ‌మాని సంతోష్‌రెడ్డి 11.34 ఎకరాలు, బాకారంలో డ్రీమ్‌వ్యాలీ 63 ఎకరాలు, నాగిరెడ్డిగూడలో నందన్‌సింగ్‌ 36.27 ఎకరాలు.

ఖాసీమ్‌బౌలి గ్రామపంచాయితీ పరిధిలో సిటీ స్వ్కేర్‌ 20 ఎకరాలు, కనకమామిడిలోని NRI కాలనీ-2, సురంగల్‌లోని ప్రెస్టీజ్‌ డెవలపర్స్‌, ఏఎంఆర్‌, ఫ్రేమ్స్‌ ఫైవ్‌.. చిల్కూరులోని కల్పవృక్ష సమృద్ధి లేఔట్‌, స్వాగత్‌ హౌసింగ్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, వెస్ట్‌ సైడ్‌ ఫామ్స్‌, బసిరెడ్డి భువన సాగర్‌ ఫామ్స్‌ ప్లాట్స్‌, బృందావన ఫామ్‌ ప్లాట్స్‌, బగీచా లేఔట్స్‌, దయాల్‌ గార్డెన్‌, డైమండ్‌ లేఔట్‌, రెడ్డిపల్లిలోని పామ్‌ స్ప్రింగ్స్ రిసార్ట్స్‌, చిన్నమంగళారంలోని ప్రగతి రిసార్ట్స్‌తో పాటు.. అప్పారెడ్డిగూడ, కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్‌ గ్రామపంచాయితీల్లో వివిధ సర్వే నంబర్లలోని కట్టడాలున్నాయ్‌.

మాటల్లేవ్‌.. ఓన్లీ యాక్ష‌నే!

111 జీవోని అక్ర‌మ నిర్మాణాల్ని నిజంగానే కూల్చేస్తారా అంటే ఇటు సీఎం రేవంత్ నుంచి.. అటు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ నుంచి అవుననే సమాధానం వస్తుంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాలు లేవు. పరిధి దాటితే అంతే సంగతులంటూ ముక్కుసూటిగా వెళుతున్నారు తెలంగాణా సీఎం రేవంత్‌ రెడ్డి. ఇటు హైడ్రా కూడా అస్సలు తగ్గట్లేదు. అర్జునుడికి చెట్టు మీదున్న పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు.. హైడ్రాకి ఇప్పుడు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలు తప్ప మరేవీ టార్గెట్‌ కాదన్నట్టు ఉంది సిట్యుయేషన్‌.

పలానా ఏరియాలో చెరువు ఆక్రమించేశారు.. కాస్త ఓ సారి ఇటు చూడండి అనే ఫిర్యాదు వస్తే చాలు.. ఛలో అనేస్తున్నారు అధికారులంతా. టేపులు పట్టుకోని సర్వేలు చేస్తూ వణుకు పుట్టిస్తున్నారు. స్వయంగా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ మ్యాప్‌లు పట్టుకోని ఫీల్డ్‌లోకి దిగడంతో బెంబేలెత్తుతున్నారు కబ్జాదారులంతా. అంగుళం తేడా వచ్చినా అంతే సంగతులు. ముందు నోటీస్‌లు ఇవ్వకుండా అలా ఏలా కూలుస్తారనే ప్రశ్నకు- మేం నోటీస్‌లివ్వం.. డైరెక్ట్‌ ఎటాకే అని స్టేటిమెంట్‌ ఇచ్చారాయన.

ఓఆర్ఆర్‌ పరిధిలో ఎలాంటి ఆక్రమణ తొలగించాలన్న నోటీస్‌లిచ్చే అధికారాన్ని హైడ్రాకే కట్టబెట్టాలని రేవంత్‌ సర్కార్ నిర్ణ‌యించింది. ఎందుకంటే- చెరువులు, కుంటలు, పార్క్‌లు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు తొలగించాలంటే ఇరిగేషన్‌, జీహెచ్ఎంసీ, మున్సిపాల్టీ, పంచాయితీరాజ్‌, వాల్టా ఇలా వివిధ డిపార్ట్‌మెంట్స్‌ నుంచి నోటీస్‌లు తెచ్చుకొని కన్ఫ్యూజ్‌ క్రియేట్‌ చేస్తూ హైడ్రా వర్క్స్‌కి అడ్డుపడుతున్నారు కొందరు. అందుకే ఈ గందరగోళానికి చెక్‌ పెడుతూ కూల్చివేతలకు సంబంధించి నోటీస్‌లు జారీ చేసే అధికారం కూడా ఇక మీదట హైడ్రాకే అప్పగించాలనే నిర్ణయించుకొచ్చింది ప్రభుత్వం.

ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాలని మున్సిపల్‌ శాఖ చీఫ్‌ సెక్రటరీ సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. అలాగే హైడ్రా బలోపేతానికి కావాల్సిన పోలీస్‌, సర్వే, ఇరిగేషన్‌ శాఖల నుండి కావాల్సిన అదనపు అధికారులు, సిబ్బందిని కేటాయించనున్నారు. అంతేకాదు ఎఫ్‌టీఎల్‌, నాలా ఎంక్రోచ్‌మెంట్‌, ప్రభుత్వ స్థలాలు, పార్కుల సంరక్షణలను కూడా హైడ్రా పరిధిలోకి తేనున్నారు. ఇక జలమండలి పరిధి కింద ఉన్న గండిపేట, హిమాయత్‌సాగర్‌ చెరువుల పరిరక్షణ సైతం హైడ్రా పరిధిలోకి రానుంది. అంటే హైడ్రాకి ఫుల్‌ పవర్స్‌ ఇచ్చేసినట్టే. సాధారణ సిబ్బంది ఉంటేనే హడలెత్తిస్తున్న హైడ్రా ఇక మీదట మరింత చెలరేగిపోవడం ఖాయం.

ట్రిపుల్‌ వన్ జీవో పరిధిలో చాలా మంది ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, సినీ సెలబ్రిటీస్‌, స్పోర్ట్స్‌ పర్సన్స్‌, పారిశ్రామికవేత్తలు తక్కువ ధరకే పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేశారు. వాటిల్లో నివాస, వాణిజ్య సముదాయాలు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లను నిర్మించుకున్నారు. మరి ప్రభుత్వం వాటిని టచ్ చేస్తుందా..? ఆ అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లు వెళతాయా..? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. మరోవైపు- ట్రిపుల్‌ వన్ జీవోని తొలగిస్తారనే ప్రచారమూ అంతే గట్టిగా జరుగుతోంది. ఇదంతా ఆచరణలోకి వచ్చేలోపు తమ పని కానిచ్చేయాలని హడావుడిగా బహుళ అంతస్థులు నిర్మించేస్తున్నారు కొందరు.

ముందైతే భవనాలు కట్టేద్దాం.. తర్వాత అనుమతులు తీసుకుందామనే ఆలోచన వారిది. ఒకవేళ 111 జీవో స్థానంలో కొత్తదాన్ని తీసుకొస్తే భూముల ధరలు పెరుగుతాయని ముందే కొనుగోలు చేసి బహుళ అంతస్థులను కట్టేస్తున్నారు. రోజుల వ్యవధిలోనే పిల్లర్లు, ఇటుకలతో నిర్మాణాలు చేసి శంషాబాద్‌, బండ్లగూడ జాగీర్‌, నార్సింగి, మెయినాబాద్‌కు సమీపంలో ఉండేవారికి ఫ్లాట్లు విక్రయిస్తున్నారు.

ఇష్టమొచ్చినట్టు ఆక్రమించి… విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టి సొమ్ము చేసుకొంటున్న వారు బానే ఉంటున్నారు. మధ్యలో బలయ్యేది మాత్రం వాటిని కొనుగోలు చేసిన అమాయకులే. అందుకే ఇలాంటి వారి ఆగడాలకు చెక్‌ పెట్టాలని రేవంత్‌ ప్రభుత్వం గట్టి పట్టుదలగా ఉంది. ఓ వైపు ప్రక్షాళన చేసి చెరువులను రక్షించడంతో పాటు.. సామాన్యులు మోసపోకుండా కాపాడటానికి నడుం బిగించింది. మరి ఈ ప్రయత్నాలన్నీ ఎంతవరకు సాగుతాయో.. రిజల్ట్‌ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

డ్రైనేజీ నీళ్లు ప్ర‌జ‌లు తాగాలా?

జంట నగరాల దాహార్తిని తీర్చే జంట జలశయాలైన హిమాయత్‌ సాగర్‌- గండిపేట చెరువులను ఆక్రమిస్తే చూస్తూ ఎలా ఊరుకుంటా..! శ్రీమంతులేమో ఫామ్‌హౌస్‌లు.. విల్లాలు కట్టుకోని ఎంజాయ్‌ చేస్తూ డ్రైనేజీని ఈ చెరువుల్లో వదిలిస్తే.. ప్రజలు ఆ నీటినే తాగాల్సి వస్తే ప్రజాప్రతినిధిగా నేను ఫ్లాప్‌ అయినట్టే కదా అనేది రేవంత్‌ మాట. అందుకే ఎవరైనా ఐ డోంట్‌ కేర్‌. ఈ విషయంలో నేను- హైడ్రా.. ఇద్దరం వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చేశారు రేవంత్ రెడ్డి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles