- ఇర్రిగేషన్ మ్యాపుల్లో చెరువులుంటే..
- మాస్టర్ ప్లాన్‌లో రెసిడెన్షియల్ జోన్
- ఇర్రిగేషన్, రెవెన్యూ, మాస్టర్‌ప్లాన్లలో
- ఒకే రకమైన వివరాలుండాలి..
- ఎఫ్‌టీఎల్‌ను ఎలా నిర్థారిస్తారు?
హైదరాబాద్‌లో చెరువులు, బఫర్ జోన్లకు సంబంధించి కొంత గందరగోళంగా ఉంది. నీటిపారుదల శాఖ వద్ద ఉన్న మ్యాపుల్లో చెరువులు, బఫర్ జోన్లు, వాటర్ బాడీస్ ఉంటే.. అదే సర్వే నెంబర్లకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌లో రెసిడెన్షియల్ జోన్‌గా కనిపిస్తుంది. దీంతో, కొత్తగా జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏలోకి విధుల్ని నిర్వర్తించే అధికారులకు కానీ సిబ్బందికి కానీ.. వీటి విషయంలో పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. మాదాపూర్‌లోని అమర్ సొసైటీలో జరిగింది కూడా ఇదే. ఇలాంటి సాంకేతిక విషయాల్ని తెలుసుకోకుండా.. హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోందని చెప్పొచ్చు.
చెరువులకు సంబంధించి ఎఫ్‌టీఎల్ ను లెక్కించే పద్ధతిలోనే తేడా ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల వద్ద చెరువులు, బఫర్ జోన్లకు సంబంధించిన విభిన్నమైన మ్యాపులు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. వీటి మధ్య సారూపత్య లేకపోవడం వల్లే అసలు సమస్యలొస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, చెరువుల ఎఫ్‌టీఎల్ సర్వే నెంబర్లకు సంబంధించి జీపీఎస్ కోఆర్డినేట్లను క్షుణ్నంగా గమనిస్తే.. నీటిపారుదల శాఖ, రెవెన్యూ, స్థానిక సంస్థల మధ్య కనీసం పది మీటర్ల తేడా ఉంటుందట.
అందుకే, గతంలో ఇర్రిగేషన్ డిపార్టుమెంట్‌కు చెందిన అధికారులు అపార్టుమెంట్లను కట్టేందుకు ఎన్వోసీ ఇస్తే.. ప్రస్తుత అధికారులేమో అవి తప్పు అని నిర్థారించే అవకాశమే ఎక్కువుందని చెబుతున్నారు. ఎందుకంటే.. ఫలానా సర్వే నెంబర్ మొత్తం ఎఫ్‌టీఎల్ కిందికొస్తుందని అధికారులే స్వయంగా చెప్పినా.. ఆ సర్వే నెంబర్ భూమ్మీదికి వచ్చేసరికి ఎక్కడ పడుతుందో నిపుణులు సైతం కరెక్టుగా చెప్పలేరు. ఎఫ్‌టీఎల్ కు సంబంధించి పేపర్ మీద ఉన్న సర్వే నెంబర్.. గ్రౌండ్ మీద కరెక్టుగా ఎలా చూపిస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్న అని చెప్పొచ్చు. మరి, ఇవన్నీ పేపర్ మీద పెట్టేసరికి కచ్చితంగా తేడా వస్తుందనే విషయాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఎవరు చెప్పాలి?
నీటిపారుదల శాఖ అధికారులు చెరువులకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను ఎక్కడా పూర్తి స్థాయిలో నిర్థారించలేదు. అందుకే, ప్రతి ఫైలు వారి వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. వారికి ఆమ్యామ్యాలు చెల్లిస్తేనే ఎన్‌వోసీ ఇచ్చే ఆనవాయితీ నెలకొంది. ఈ విధానానికి వెంటనే స్వస్తి పలకాలి. చెరువులకు సంబంధించి గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను మార్కు చేసి.. ఆయా సర్వే నెంబర్లను గూగుల్ ఎర్త్ మీద సూపర్ ఇంపోజ్ చేయాలి. వాటిని మాస్టర్ ప్లాన్లలో కూడా పొందుపర్చాలి. ఇలా చేయడం వల్ల ఇర్రిగేషన్, రెవెన్యూ, స్థానిక సంస్థలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్లలో వివరాలన్నీ ఒకేరకంగా ఉంటాయి. దీని వల్ల భవిష్యత్తులోనూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీటిపారుదల శాఖ నుంచి ప్రత్యేకంగా ఎన్వోసీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించి నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపల్ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని మూడు లేయర్లుగా ప్రజలకు తెలిసేలా పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి. అప్పుడే, చెరువుల్లో ఇళ్లు, భవనాల్ని కట్టడానికి ఎవరైనా ప్రయత్నించినా అనుమతుల్ని నిరాకరించొచ్చు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించి ప్రజలకు తెలిసేలా.. పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి. దీంతో చెరువుల్ని కబ్జా చేయడానికి ఎవరూ సాహసం చేయరు.
భవిష్యత్తులో చెరువులు కబ్జా కాకుండా ఉండాలంటే, ఎఫ్‌టీఎల్ మ్యాపులను డిజిటలైజ్ చేసి.. ఆయా ప్రాంతాలకు ఫెన్సింగ్ వేస్తే.. చెరువుల్ని కబ్జా చేసే సాహసం ఎవరూ చేయరు. బఫర్ జోన్లలో ఇళ్లను నిర్మించరు.