దసరా పండగ సీజన్.. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లకు కాస్త బూస్ట్ ఇచ్చింది. ముంబైలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 13 శాతం, స్టాంప్ డ్యూటీ ఆదాయం 15 శాతం మేర పెరిగింది. గతేడాది ఇదే కాలంలో రోజుకు సగటున 510 యూనిట్లు రిజిస్టర్ కాగా, ఈ ఏడాది 578 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. 2023లో నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల్లో 4,594 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఈ ఏడాది 5,199కి పెరిగాయి. అలాగే 2023లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల ద్వారా మహారాష్ట్ర ఖజానాకు రూ.436 కోట్లు రాగా, ఈ ఏడాది ఇదే సమయంలో రూ.502 కోట్లు ఆదాయం వచ్చింది. ఇది గతేడాది కంటే 15 శాతం ఎక్కువ అని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. 2023లో నవరాత్రి తొమ్మిది రోజుల్లో రోజుకు సగటున 510 ప్రాపర్టీ యూనిట్లు రిజిస్టర్ కాగా, ఈ ఏడాది రోజుకు సగటున 578 యూనిట్లు రిజిస్టర్ అయినట్టు పేర్కొంది.
అయితే, గణేశ్ చతుర్థి పండగ సమయంలో మాత్రం రిజిస్ట్రేషన్లు తగ్గాయి. 2023 గణేశ్ పండగ సమయంలో 3700 యూనిట్లు రిజిస్టర్ కాగా, 2024లో 10 శాతం తగ్గి 3400 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. 2023 సెప్టెంబర్లో 10,694 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఈ ఏడాది సెప్టెంబర్లో కాస్త తగ్గి 9,111 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. ‘పండుగ సీజన్‌లో అమ్మకాలు పుంజుకున్నాయి, ఇది ఆస్తి రిజిస్ట్రేషన్‌లలో గణనీయమైన పెరుగుదలకు దారితీసింది. నవరాత్రి సెంటిమెంట్ కొనుగోళ్లకు కలిసి వచ్చింది’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ పేర్కొన్నారు.