- ఇళ్ల కొనుగోళ్లపై ఆఫర్లే ఆఫర్లు
- పుణెలో కరోనా తర్వాత తొలిసారిగా పండగ ప్రోత్సాహకాలు
- ఢిల్లీలోనూ ఆకర్షణీయ పథకాలు
ఏ పండగకైనా ఆఫర్లు అనేవి సర్వసాధారణం. బట్టల దగ్గర నుంచి గృహోపకరణాల వరకు పలు రకాలు ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటారు. రియల్ ఎస్టేట్ లోనూ ఈ ఆఫర్లు కొత్త కాదు. తాజాగా పుణెలో దీపావళి సందర్భంగా డెవలపర్లు పలు ఆఫర్లు ప్రకటాంరు. జీరో స్టాంపు డ్యూటీతోపాటు స్వాధీనం చేసుకునే వరకు నో ఈఎంఐ వంటి ప్లాన్లు జోరుగా సాగుతున్నాయి. కరోనా తర్వాత తొలిసారిగా ఇలాంటి ఆఫర్లు ప్రకటించడం గమనార్హం. పుణె రియల్ ఎస్టేట్ మార్కెట్ 2015 నుంచి 2019 వరకు ఒడుదొడుకులకు లోనైంది. అయితే, కోవిడ్-19 తర్వాత హైబ్రిడ్ వర్క్ కల్చర్ ప్రారంభమై పుణెలోని పెద్ద అపార్ట్ మెంట్లకు డిమాండ్ పెరిగింది. దీనివల్ల అప్పట్లో డెవలపర్లు ఎలాంటి ఆఫర్లూ ఇవ్వలేదు.
కానీ, ఇప్పుడు అమ్మకాలు క్రమంగా మందగించడంతో, డెవలపర్లు కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఆఫర్లు తెరలేపారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ముంబై, బెంగళూరుకు చెందిన పలువురు డెవలపర్లు పుణె రియల్ మార్కెట్లో ప్రవేశించారు. వీరిలో లోధా, దోస్తీ రియాల్టీ, అదానీ రియల్టీ, పూర్వాంకర, ప్రెస్టీజ్ గ్రూప్ వంటివి ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత పండుగ సీజన్లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. ముఖ్యంగా జీరో స్టాంపు డ్యూటీతోపాటు 24 నెలల వరకు నో ఈఎంఐ వంటివి ఆదరణ పొందుతున్నాయి. కొన్ని సంస్థలు ప్లాట్ డెలివరీ చేసే వరకు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నాయి. ఐటీ రంగంలో మందగమనం కారణంగా రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ ధర ఉన్న అపార్ట్ మెంట్ల అమ్మకాలపై ప్రభావం పడింది. దీంతో వీటి అమ్మకాలు తగ్గాయి.
అందుబాటు ధరల పరిధిలో సరఫరా తక్కువగా ఉండటం వల్ల వీటి అమ్మకాలపై ప్రభావం అంతగా లేదు. ముఖ్యంగా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అమ్మకాలను పరిశీలిస్తే.. పుణె, బెంగళూరు, హైదరాబాద్ లలో తగ్గాయి. ఐటీ రంగంలో మందగమనమే ఇందుకు కారణమని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. వార్షిక ప్రాతిపదికన పుణెలో మెట్రోపాలిటన్ రీజియన్ లో దాదాపు 80 వేల నుంచి 90 వేల యూనిట్ల విక్రయాలు జరుగుతాయి. వీటిలో 50 శాతం కంటే ఎక్కువ యూనిట్లు ఐటీ నిపుణులే కొనుగోలు చేస్తారని అంచనా. కాగా, పూణేలో, జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 13% క్షీణించి 18,749కి చేరుకున్నాయి. ఈ కాలంలో అమ్ముడైన యూనిట్ల విలువ 8% తగ్గి ₹13,788 కోట్లకు చేరుకుంది.
బంగారు నాణేల నుంచి లగ్జరీ కార్ల వరకు…
ఢిల్లీలోనూ ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. బంగారు నాణేల నుంచి లంబోర్గిని లగ్జరీ కార్ల వరకు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే అంతర్జాతీయ పర్యటనలు, ఉచిత మాడ్యులర్ కిచెన్, మొబైల్ ఫ్లోన్ల వంటి ఆఫర్లుగా ప్రకటిస్తున్నారు. ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్‌లతో పాటు, డెవలపర్‌లు ఈ పండుగ సీజన్‌లో అన్ని ఫ్లాట్‌లకు ఈవీ చార్జింగ్ పోర్టులు, హోమ్ ఆటోమేషన్, సోలార్ గీజర్ల వంటి స్థిరమైన జీవన-కేంద్రీకృత సౌకర్యాలను కూడా అందిస్తున్నారు. నోయిడాలోని ఓ అల్ట్రా లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులో ప్రతి విల్లా కొనుగోలుదారునికి ఉచితంగా లంబోర్ఘిని కారు ఇస్తానని పేర్కొంది.
ఒక్కో విల్లా ఖరీదు కనీసం రూ.26 కోట్లు కావడం గమనార్హం. గురుగ్రామ్‌లోని సిగ్నేచర్ గ్లోబల్ అనే సంస్థ ఇటీవల ‘జో సబ్‌కీ బోల్టీ బ్యాండ్ కర్ దే’ ఆఫర్‌లతో బెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రియల్టీ ఫెస్ట్ ను నిర్వహించింది. ఇళ్ల కొనుగోలుదారులకు 15% తగ్గింపు, ఉచిత క్లబ్ మెంబర్‌షిప్, పార్కింగ్, రాడో వాచ్ పెయిర్, లక్కీ డ్రా వంటివి ప్రకటించింది. ముగ్గురు కొనుగోలుదారులు రూ.60 లక్షల ధర గల లగ్జరీ బీఎండబ్ల్యూ కార్లను గెలుచుకున్నారు.