క్యూ3లో టాప్ ఫెర్మార్ గా గుర్తింపు
రెండో స్థానంలో ప్రెస్టీజ్
హైదరాబాద్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ లో సెప్టెంబర్ త్రైమాసికంలో అపర్ణ కన్ స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జూలై-సెప్టెంబర్ కాలంలో 625 యూనిట్ల విక్రయాలు, రూ.510 కోట్ల ఆదాయంతో అదరగొట్టింది. అలాగే ప్రెస్టీజ్, బ్రిగేడ్ వంటి బ్రాండెడ్ డెవలపర్లు ఇటీవలి త్రైమాసికాల్లో టాప్-10 డెవలపర్ల జాబితాలోకి ప్రవేశించాయని స్క్వేర్ యార్డ్స్ నివేదిక వెల్లడించింది. ప్రెస్టీజ్ గ్రూప్ 214 రెసిడెన్షియల్ రిజిస్ట్రేషన్లు, రూ. 334 కోట్ల అమ్మకపు విలువతో రెండో స్థానంలో నిలిచినట్టు పేర్కొంది.
ఖాజాగూడలోని అపర్ణా జెనాన్, కోకాపేట్‌లోని ప్రెస్టీజ్ ట్రాంక్విల్తో సహా ఔటర్ రింగ్ రోడ్ కి కనెక్టివిటీని అందించే ప్రాజెక్టులకు బలమైన డిమాండ్‌ను కలిగి ఉన్నట్టు తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ ప్రాజెక్టులు హైదరాబాద్‌లో లావాదేవీల పరిమాణం, విక్రయాల విలువ రెండింటిలోనూ అగ్రగామిగా నిలిచాయని పేర్కొంది. కాగా, హైదరాబాద్ మైక్రో మార్కెట్ల ట్రెండ్ వివరాలను కూడా నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన లావాదేవీలలో 45% వాటాతో పశ్చిమ శివారు ప్రాంతాలు అత్యంత చురుకైన ప్రాంతంగా ఉన్నట్టు తెలిపింది.
హైదరాబాద్ ఈస్ట్ 17% వాటాతో ఉంది. అమ్మకాల విలువ పరంగా కూడా వెస్ట్ మైక్రో-మార్కెట్ 56 శాతం ఆధిపత్య వాటాతో ముందుండగా.. ఈస్ట్ 12 శాతం, సెంట్రల్ 11 శాతం వాటాతో ఉన్నాయి. సగటు లావాదేవీ పరిమాణం విషయంలోనూ పశ్చిమ శివారు ప్రాంతాలదే ఆధిపత్యం కొనసాగింది. ఇక్కడ అత్యధిక సగటు లావాదేవీ రూ.76 లక్షలుగా నమోదైంది.