తెలంగాణకు సూపర్ గేమ్ ఛేంజర్‌గా మారనున్న రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టును పట్టాలెక్కుతోంది. ప్రస్తుతం ఔటర్ రింగు రోడ్డుకు సుమారు 40 కిలోమీటర్ల వెలుపలా.. పలు జిల్లాలను కలుపుతూ మెుత్తం 350 కిలోమీటర్ల మేర రీజినల్ రింగు రోడ్డును నిర్మిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ ను ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మిస్తుండగా.. ఈ రహదారి పూర్తయితే సగం తెలంగాణ అభివృద్ది చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
సుమారు 161.59 కిలో మీటర్ల మేర నిర్మించనున్న ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి.. ఇటీవలే నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా టెండర్లు పిలిచింది. 189 కిలోమీటర్ల మేర నిర్మించే దక్షిణ భాగం నిర్మాణానికి డీపీఆర్ రూపకల్పనకు కన్సల్టెన్సీ సంస్థ కోసం తెలంగాణ సర్కార్ టెండర్లు పిలిచింది. ఈ క్రమంలో ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు లను కలుపుతూ రేడియల్ రోడ్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మెుత్తం 11 చోట్ల ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులను కలుపుతూ రహదారులను నిర్మించేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది రేవంత్ సర్కార్. ఈ 11 రేడియల్ రహదారుల మొత్తం పొడవు 300 కిలో మీటర్లకుపైగానే ఉండనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకోసం దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 2, 4, 8, 10, 13, 15 నంబర్లతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించేలా కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే కొన్నిచోట్ల భూసేకరణకు నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు.
* ఓఆర్ఆర్-ట్రిపుల్ ఆర్ అనుసంధానికి సంబందించిన ప్రాజెక్టులో భాగంగా కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించాలని అనుకున్నా.. వివిధ సమస్యల కారణంగా అవకాశం ఉన్నచోట పాత రహదారులనే రేడియల్ రోడ్లుగా అభివృద్ధి చేయాలని సర్కార్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై సమీక్షించిన సీఎం రేవంత్ అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లకు మధ్యలో కొన్నిచోట్ల గ్రామాలు, పట్టణాలు వస్తుండగా.. మరికొన్ని చోట్ల రహదారికి మధ్యలో చాలా వరకు అటవీ భూములు ఉన్నాయి. రహదారుల డిజైన్‌లోనూ సాంకేతిక సమస్యలు వస్తుండటంతో పాత రోడ్లను విస్తరించి రేడియల్ రోడ్లను అభివృద్ది చేయాలనే ప్రతిపాదనను అధికారులు తెరపైకి తీసుకొచ్చారు.
* ఇప్పటికే జాతీయ రహదారులు, ఓఆర్‌ఆర్, పరిశ్రమల అభివృద్ధికి పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టారు. మళ్లీ భూసేకరణ అంటే స్థానిక ప్రజల నుంచి ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవకాశం ఉన్నచోట బ్రౌన్‌ఫీల్డ్ రోడ్లను కనెక్ట్ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీలైనంత త్వరగా రేడియల్ రోడ్లను పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇక ఓటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు ను అనసంధానం చేస్తూ నిర్మించే ఈ 11 గ్రీన్ ఫీల్డ్ రోడ్లు అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాలలో మీని టౌన్ షిప్పులు, గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్స్, వేర్ హౌజులను అభివృద్ది చేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని అంచనా వేస్తున్నారు.