-
- రూ.22.5 కోట్లకు విక్రయించిన సోనాక్షి సిన్హా
- అదే భవనంలో రూ.24 కోట్లకు ఫ్లాట్ కొన్న సుభాష్ ఘయ్
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ముంబై బాంద్రాలోని అపార్ట్ మెంట్ ను 61 శాతం లాభానికి విక్రయించారు. 2020లో రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన ఆ అపార్ట్ మెంట్ ను ఆమె తాజాగా రూ.22.5 కోట్లకు అమ్మారు. బాంద్రా వెస్ట్ లోని 81 ఆరియట్ భవనం 16వ అంతస్తులో ఈ ప్రాపర్టీ ఉంది. సోనాక్షికి అదే భవనంలో మరో అపార్ట్ మెంట్ కూడా ఉంది. దానిని 2023లో రూ.11 కోట్లకు కొన్నారు. కాగా, 4.48 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఈ అపార్ట్ మెంట్లో అన్నీ 4 బీహెచ్ కే అపార్ట్ మెంట్లే ఉన్నాయి. సోనాక్షి సిన్హా విక్రయించిన అపార్ట్ మెంట్ 4,21 చదరపు అడుగుల కార్పెట్, 4,632 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో మూడు కార్ పార్కింగ్ స్థలాలు కలిగి ఉంది.
గతనెల 31న రిజిస్ట్రేషన్ జరగ్గా.. రూ.1.35 కోట్లను స్టాంపు డ్యూటీ కింద, రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజు కింద కొనుగోలుదారు చెల్లించారు. ఢిల్లీకి చెందిన రిచి బన్సాల్ అనే వ్యక్తి దీనిని కొనుగోలు చేశారు. కాగా, ఈ ప్రాజెక్టులో 4 బీహెచ్ కే ప్రాపర్టీ పున: విక్రయ ధర చదరపు అడుగుకు రూ.51,636గా ఉండగా.. ఈ ప్రాపర్టీకి నెలకు వచ్చే అద్దె రూ.8.5 లక్షలుగా ఉంది. మరోవైపు ఇదే భవనంలోని ఓ అపార్ట్ మెంట్ ను బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘయ్ రూ.24 కోట్లకు కొనుగోలు చేశారు.
సుభాష్ ఘాయ్, ఆయన భార్య కలిసి ఈ అపార్ట్ మెంట్ కొన్నారు. గతనెలలో వీరు అంధేరిలోని తమ ఫ్లాట్ ను రూ.12.85కోట్లకు విక్రయించారు. తాజాగా 81 ఆరియట్ లోని ఫ్లాట్ ను రూ.24 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. ఈ అపార్ట్ మెంట్ 4,364 చదరపు అడుగులు (405.42 చదరపు మీటర్లు) కార్పెట్ ఏరియా, 5,239 చదరపు అడుగులు (486.69 చదరపు మీటర్ల) బిల్ట్-అప్ ఏరియా కలిగి ఉంది. ఇందులో మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీకి రూ. 1.44 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. 81 ఆరియట్ ప్రాజెక్టుకు మంచి డిమాండ్ ఉంది. ముంబైలోని కీలక వాణిజ్య కేంద్రమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ కి సమీపంలో ఉండటం వల్ల ఇది చాలామందికి ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. బాలీవుడ్ తారలు సునీల్ శెట్టి, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, క్రీడా ప్రముఖులు కేఎల్ రాహుల్, అతియా శెట్టి కూడా ఈ పరిసరాల్లో ప్రాపర్టీలు కొన్నారు.