తెలంగాణలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్-ఎల్ఆర్ఎస్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మార్చి నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్ పెనాల్టీ చెల్లిస్తే 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాటితో పాటు కొత్తగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రేవంత్ సర్కార్ ప్రకటించింది. కానీ ఎల్ఆర్ఎస్ అధికారిక వెబ్ సైట్ లో మాత్రం కొత్త అప్లికేషన్ల ఆప్షన్ ను నిలిపివేశారని సూచిస్తోంది. దీంతో కొత్తగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో అనధికార లేఅవుట్లు, అందులోని ప్లాట్ల క్రమబద్ధీకరణ -ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. చెరువుల ఎఫ్టీఎల్కు 200 మీటర్ల పరిధిలోని, ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు మినహా మిగతా సర్వే నంబర్లలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఆటోమేటెడ్ గా ఫీజు ఖరారు చేయనుంది. మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజుతో పాటు ఓపెన్స్పేస్ ఛార్జీలు చెల్లిస్తేనే 25 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేస్తున్న 25.54 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో పాటు కొత్తగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలో చాలా మంది కొత్తగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించగా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో ఆ ఆప్షన్ కనిపించడం లేదు. ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్ లో New Application Submission for LRS 2020 is stopped అని ఉంది. దీంతో కొత్తగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇంకా ఆప్షన్ ఇవ్వలేదని తెలుస్తోంది. మార్చి 31 నాటికి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించడంతో చాలామంది ఆత్రుతతో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో కొత్త ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఇంకా ఆప్షన్ ఇవ్వకపోవడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొత్త ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లకు ఎప్పుడు అవకాశం కల్పిస్తుందో తెలియక అయోమయంలో పడ్డారు.