రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ముందుచూపుతో ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో రైతులు భూములకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడొద్దనేది ఆయన ఉద్దేశ్యం. భవనాల్ని నిర్మించే బిల్డర్లూ భూముల రికార్డుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చేయాలన్నది సీఎం సంకల్పం. ఇంతటి వ్యూహాత్మక ఆలోచనలకు తగ్గట్టుగా.. ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ధరణిలో ఎదురయ్యే వాస్తవిక సమస్యలకు పరిష్కారం చూపెడితే.. ఇది వంద శాతం విజయవంతం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ధరణికి సంబంధించి స్టేక్ హోల్డర్లతో సమావేశం ఏర్పాటు చేసి పలు సమస్యల్ని పరిష్కరించాలని కోరుకుంటున్నారు. లేకపోతే ధరణి రైతులపాలిట ఒక పెద్ద గుడిబండగా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
మెదక్ జిల్లాలో ఒక రైతుకు తాతల నుంచి వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల భూమి ఉంది. అతనికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఇటీవల అతను మరణించారు. అయితే, భూమికి సంబంధించిన లీగల్ హెయిర్స్ (కుమారులు, కుమార్తెలు) గురించి ధరణిలో ప్రత్యేకంగా కాలమ్ పెట్టలేదు. దీంతో, ఆయా భూమిని పంచుకునే విషయంలో ఆ కుటుంబం ఇబ్బంది పడుతోంది. ఆస్తి తగాదాల్లో ఎక్కువగా భాగాలు పంచుకోవడం వద్దే వస్తుంది కదా? మరి, ఆస్తికి సంబంధించి ఇంత కీలకమైన అంశాన్ని ధరణి పోర్టల్‌లో ఎందుకు చేర్చలేదు?
- సాధారణంగా రైతులకు వారసత్వంగా తాత, ముత్తాతల నుంచి భూములు సంక్రమిస్తాయి. కాబట్టి, ధరణి పోర్టల్‌లో కచ్చితంగా ఈ కాలమ్ ఉండాల్సిందే. వారసులుగా నమోదయ్యే వారి పేర్లను నమోదు చేయాలి. అప్పుడే అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి వివాదాలు భవిష్యత్తులో ఏర్పడే అవకాశాలుండవు. కానీ, ప్రస్తుతం కేవలం కన్సెన్టింగ్ పార్టీ ఒకటే ఆప్షన్ పెట్టారు. అతను ఒక్కడే ఆయా స్థలానికి హక్కుదారుడు, మిగతవారెవరూ లేరని చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత కోర్టుల్లో లీగల్ హెయిర్లకు సంబంధించి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
- రెక్టిఫికేషన్ డీడ్, ర్యాటిఫికేషన్ డీడ్ వంటివి ధరణిలో పొందుపర్చలేదు.
- నాలా ఛార్జీలు కట్టేందుకు అవసరమయ్యే బ్యాండ్‌విడ్త్ సపోర్టు చేయడం లేదు. వివరాలన్నీ నింపి.. డాక్యుమెంట్ అప్‌లోడ్ చేస్తే సిస్టమ్ సపోర్టు చేయడం లేదు.
- ఇప్పటికే రైతులు, పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ధరణిలో రకరకాల సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. మరి, ఈ సమస్యలకు వీలైనంత త్వరగా ప్రభుత్వమే పరిష్కారం చూపెట్టాలి. లేకపోతే, ధరణి సమస్యలతో చిరాకుపడి రైతులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.