ఔను.. మీరు చదివింది నిజమే. ఇప్పుడే కాదు గత కొంతకాలం నుంచి హైదరాబాద్లోని హెచ్ఎండీఏ ప్రాంతంలో పరిస్థితి రివర్సుగానే కనిపిస్తోంది. ఒకసారి ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్ని గమనిస్తే.. ముందుగా మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేశాకే.. ఆయా ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాలు, ఆధునిక లగ్జరీ విల్లాలకు అనుమతిని మంజూరు చేస్తారు. కానీ, మన భాగ్యనగరం మాత్రం ఇందుకు భిన్నం. ఎందుకో తెలుసా?
అధికార పార్టీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చోటామోటా నేతలు నిర్మాణాల అనుమతుల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు. అందుకే, అభివృద్ధికి సంబంధించి హెచ్ఎండీఏ ప్రాంతమంతా అస్తవ్యస్తంగా మారుతున్నది. మౌలిక సదుపాయాల్లేని ప్రాంతాల్లో బిల్డర్లు బడా బడా నిర్మాణాల్ని చేపడుతున్నారు. వాళ్లకు అనుమతులెలా వస్తున్నాయంటే.. రాజకీయపరమైన ఒత్తిళ్లు ఒక కారణం కాగా… డెవలపర్లలో చాలామందికి ప్రభుత్వ పెద్దలతో ప్రత్యక్ష సంబంధాలుండటమో ప్రధాన కారణం. పశ్చిమ హైదరాబాద్ చేరువలోని తెల్లాపూర్, కొల్లూరు, వెలిమెల, పాటి ఘనపూర్, ఉస్మాన్ నగర్, మోకిలా వంటి ప్రాంతాల్ని గమనిస్తే.. అక్కడ పూర్తి స్థాయిలో రహదారులు అభివృద్ధి చెందలేదు. డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ప్రాంతాలకు మంచి నీటి సరఫరా పనులు ఎంతవరకూ వచ్చాయో తెలియదు. ఇదొక్కటే కాదు.. బండ్లగూడ, కిస్మత్‌పూర్, నార్సింగి, మంచిరేవుల వంటి ప్రాంతాల్లోనూ ఇదే సమస్య. నిన్నటివరకూ బండ్లగూడ నుంచి కిస్మత్‌పూర్ వెళ్లే రహదారి చాలా దారుణంగా ఉండేది. ఇక సర్వీస్ రోడ్డు నుంచి కిస్మత్‌పూర్ ని అనుసంధానం చేసే రహదారిని చూస్తే ముక్కుమీద వేలు వేసుకోవాల్సిందే. ఔటర్ రింగ్ రోడ్డు, దాని పక్కనే గల సర్వీస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో రోడ్లు మెరుగ్గా ఉన్నప్పటికీ, అంతర్గతంగా కాస్త లోపలికి వెళితే రహదారులు దారుణంగా దర్శనమిస్తున్నాయి. అయినా, అవేమీ పట్టించుకోకుండా నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు.. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ.. బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తున్నాయి.
పరిష్కారమెలా?
ఇప్పటికైనా పురపాలక శాఖ అధికారులు కళ్లు తెరవాలి. ప్రధానంగా హెచ్ఎండీఏ పరిధిలో.. డెవలపర్లు ఇచ్చే అమ్యామ్యాలకు అలవాటు పడిపోయి ఎక్కడపడితే అక్కడ నిర్మాణాలకు అనుమతిని మంజూరు చేసే సంస్కృతికి చరమగీతం పాడాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్ధతిస్తారు కదా అని ఎక్కడ పడితే అక్కడ ఆకాశహర్మ్యాలకు మంత్రి కేటీఆర్ పచ్చజెండా ఊపకూడదు. ఏదైనా ప్రాజెక్టుకు అనుమతిని మంజూరు చేసే ముందు.. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలన్నీ అభివృద్ధి చేశాకే అనుమతినివ్వాలి. కనీసం ఆ ప్రాజెక్టు పూర్తయ్యేలోపు అయినా ఆయా కార్యక్రమాల్ని పూర్తి చేయాలి. తెల్లాపూర్‌లో ఏలియెన్స్ స్పేస్ స్టేషన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాకా సరైన దారి లేకపోయినా, అక్కడ విల్లాలకు, బహుళ అంతస్తుల భవనాలకు గతంలో హెచ్ఎండీఏ అనుమతినిచ్చింది. కనీసం ఇప్పుడైనా పరిస్థితిలో మార్పు రావాలి. లేకపోతే, హైదరాబాద్ రియల్ రంగం పరిస్థితి రివర్స్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదు.