హైదరాబాద్‌లో నెలవారీ ఆఫీస్ స్పేస్ అద్దెలు పెరుగుతున్నాయి. 2017–18 ఆర్ధిక సంవత్సరంలో చ.అ. రెంట్ నెలకు రూ.51 ఉండగా.. 2018–19 నాటికి రూ.53కు, 2019–20లో రూ.56కు, 2020–21 ఆర్ధికం నాటికి రూ.57కి వృద్ధి చెందింది. గత ఆర్ధికంలో నగరంలో గచ్చిబౌలిలో రెండు ప్రధాన ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. దివ్యశ్రీ ఓరియన్‌లో వెల్స్‌ఫార్గో 13 లక్షల చ.అ., సాలార్పూరియా సత్వా నాలెడ్జ్ క్యాపిటల్‌లో గూగుల్ 10 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్‌ను అద్దెకు తీసుకుంది.
– ఆఫీస్ స్పేస్ అద్దెల వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు ముంద వరుసలో ఉన్నాయి. బెంగళూరులో గత ఆర్ధికంలో చ.అ. అద్దె నెలకు రూ.77గా ఉంది. చెన్నైలో రూ.60, ఎంఎంఆర్‌లో రూ.125, పుణేలో రూ.68, ఎన్సీఆర్లో రూ.78గా ఉంది.
డిమాండ్ ఎందుకంటే..
గత రెండు మూడేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలలో స్టార్టప్స్ విపరీతంగా పెరగడం, తయారీ, పారిశ్రామిక రంగాలు వృద్ధి బాటలో కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాలలో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఏర్పడుతుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పురీ తెలిపారు. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కంటే హైదరాబాద్‌లోనే ధరలు అందుబాటులో ఉండటం వల్ల ఆఫీస్ స్పేస్ నిర్మాణ సంస్థలు, పెట్టుబడిదారులు నగరం వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లోనే డిమాండ్..దేశంలో కార్యాలయాల స్థలాల లావాదేవీలలో దక్షిణాది రాష్ట్రాల హవా కొనసాగుతుంది. సప్లయి, లావాదేవీలు, అద్దెలు అన్నింట్లోను సౌత్ స్టేట్స్లోనే వృద్ధి నమోదవుతుంది. గత ఆర్ధిక సంవత్సరం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2.13 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 66 శాతంగా ఉంది. పశ్చిమాది రాష్ట్రాల వాటా 21 శాతం, నార్త్ స్టేట్స్ వాటా 11 శాతంగా ఉంది.
2020–21 ఫైనాన్షియల్ ఇయర్లో జరిగిన దక్షిణా రాష్ట్రాల్లోని 66 శాతం ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో 1.4 కోట్ల చ.అ. లావాదేవీలు జరిగాయి. వెస్ట్ రాష్ట్రాల్లోని ట్రాన్సాక్షన్స్లో ముంబై, పుణే నగరాల్లో 45.6 లక్షల చ.అ. నార్త్‌లోని లావాదేవీల్లో ఎన్సీఆర్ నగరంలో 23 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి. దేశంలోని టాప్–7 నగరాల్లో 2017–18 ఆర్ధిక సంవత్సరంలో 3.11 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా దక్షిణాది రాష్ట్రాల వాటా 47 శాతం కాగా, పశ్చిమంలో 33 శాతం, ఉత్తరంలో 17 శాతం వాటా కలిగి ఉన్నాయి. అలాగే 2018–19 ఆర్ధికంలో 3.58 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. దక్షిణంలో 57 శాతం, వెస్ట్‌లో 25 శాతం, నార్త్‌లో 15 శాతం, 2019–20 ఆర్ధిక సంవత్సరంలో 4.3 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. సౌత్‌లో 55 శాతం, వెస్ట్‌లో 22 శాతం, నార్త్‌లో 20 శాతం వాటాలు కలిగి ఉన్నాయి.
సరఫరా సౌత్‌లోనే..
కొత్త ఆఫీస్ స్పేస్ సప్లయి కూడా దక్షిణాది రాష్ట్రాలనే ఎక్కువగా ఉంది. గత ఆర్ధికంలో 4.02 కోట్ల చ.అ. సప్లయి జరగగా ఇందులో సౌత్ వాటా 63 శాతంగా ఉంది. పశ్చిమాది రాష్ట్రాల వాటా 19 శాతం, నార్త్ వాటా 18 శాతంగా ఉన్నాయి. 2019–20 ఆర్ధికంలోనూ అంతే. మొత్తం 4.36 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. 59 శాతం దక్షిణాదిలో, 16 శాతం వెస్ట్‌లో, 24 శాతం ఉత్తరాది రాష్ట్రాలలో జరిగాయి.