- రివర్స్ మెర్జర్ ద్వారా కొనుగోలు ప్రక్రియ పూర్తి
తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్టు పిరమల్ ఎంటర్ ప్రైజెస్ వెల్లడించింది. రుణపరిష్కార ప్రణాళికలో భాగంగా రివర్స్ మెర్జర్ ద్వారా డీహెచ్ఎఫ్ఎల్ విలీనం పూర్తిచేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు రూ.34,250 కోట్లను రుణదాతలకు చెల్లించామని తెలిపింది. ఫిక్స్ డ్ డిపాజిట్ దారులతోపాటు రుణదాతలు మొత్తం రూ.38వేలు కోట్ల మేర సొమ్మును పొందారని వివరించింది. ఈ విలీనం గతనెల 30 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. రివర్జ్ మెర్జర్ నేపథ్యంలో పిరమల్ క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీసీహెచ్ఎఫ్ఎల్) అంటే.. పిరమల్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (పీఈఎల్) వాటాదారులలకు డీహెచ్ఎఫ్ఎల్ ఈక్విటీ షేర్లను జారీచేస్తుంది. నాలుగువారాల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయనుంది. అంటే డీహెచ్ఎఫ్ఎల్ లోని వందశాతం వాటా పిరమల్ ఎంటర్ ప్రైజెస్ వశమవుతుంది. తమ గ్రూప్ ఆర్థిక సేవల కార్యకలాపాలను మరింత విస్తరించడానికి ఈ విలీనం దోహదపడుతుందని పీఈఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. డీహెచ్ఎఫ్ఎల్ భారీగా రుణాలిచ్చి దాదాపు రూ.90వేల కోట్ల మేర నష్టాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో పిరమల్ గ్రూప్ ఓ రుణపరిష్కార ప్రణాళికతో ముందుకొచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్ కు రుణాలిచ్చినవారిలో 94 శాతం మంది దానికి అనుకూలంగా ఓటేశారు. తాజాగా ఈ విలీన ప్రక్రియ పూర్తయింది.