మీరు చదివింది ఐదో తరగతేనా? అయినా మీరేం దిగులు పడక్కర్లేదు. మీకో మాంచి సంస్థలో ఉద్యోగం లభించేందుకు బ్రహ్మాండమైన అవకాశముంది. మీరు తలెత్తుకుని ఎంచక్కా మీ కుటుంబాన్ని పోషించుకోగల్గుతారు.
‘ఊరుకోండి సార్.. బడా బడా చదువులు చదివినవారికే సరైన నౌకరీ దొరకడం లేదు.. ఇక, మాలాంటి వారికెక్కడ లభిస్తుంది?’’ అని అంటారా?
ఆగండాగండీ.. అక్కడికే వస్తున్నాం.. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గనిర్దేశంలో.. ఐదో తరగతి చదివిన వారు.. తమ నైపుణ్యం పెంపొందించుకునే చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదెక్కడో తెలుసా? మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ లో. మరెందుకు ఆలస్యం.. ఆ వివరాలంటే తెలుసుకోవాలని ఉందా?
హైదరాబాద్ ప్రపంచ నగరంగా ఖ్యాతినార్జిస్తోంది. ఈ క్రమంలో భాగంగా మన వద్ద నిర్మాణ రంగం గణనీయంగా వ్రుద్ధి చెందుతోంది. నిర్మాణ రంగంలో పెరుగుతున్న అవకాశాల్ని స్థానికులకు అందించాలన్న ఉన్నత లక్ష్యాన్ని ఎన్ఏసీ నిర్దేశించుకుంది. ఈ రంగానికి సంబంధించిన వ్రుత్తులలో నిరుద్యోగులకు నైపుణ్యమైన శిక్షణు అందించడంతో పాటు వారికి ఉపాధిని కల్పించేందుకు ఆరంభం నుంచి క్రుషి చేస్తోంది. ఇప్పటివరకూ దాదాపు నాలుగు లక్షల మందికిపైగా శిక్షణను అందజేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 75 వేలకు పైగా మందికి శిక్షణను అందించింది. ఎన్ఏసీ ప్రత్యేకత ఏమిటంటే.. గల్ఫ్ వెళ్లి వచ్చినవారికి ప్రత్యేక శిక్షణను అందజేస్తోంది. పైగా, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి శిక్షణనిచ్చి అంతర్జాతీయ గుర్తింపు గల ఎన్ఓసీఎస్ యుకే సర్టిఫికెట్ ను జారీ చేస్తుంది. మరి, ఎన్ఏసీ కేవలం ఐదో తరగతి చదివినవారికి ఎలాంటి శిక్షణను అందిస్తుందో తెలుసా?
మేషన్ జనరల్ (400 గంటలు)
అర్హత: 5వ తరగతి
తాపీ పనితో బాటు కాంక్రీటులోనూ ఉపయోగించే సామగ్రి వివరాల్ని ఈ శిక్షణలో నేర్పిస్తారు. ఇళ్ల నిర్మాణంలో వినియోగించే మాలు (సిమెంట్ కాంక్రీటు)లో ఎన్నిరకాలుంటాయి? వాటిని ఎలా కలపాలి? ఎలా వినియోగించాలో చెబుతారు. ఇటుకతో గోడ కట్టడమెలా? పాయింటింగ్, ప్లాస్టరింగ్, క్యూరింగ్ వంటివి నేర్పిస్తారు. వాటర్ ప్రూఫింగ్ ఎలా చేయాలో చెబుతారు. కాంక్రీటుకు ఉపయోగించే పదార్థాల్ని ఎలా కలపాలి? ఇందులోని ఆధునిక పద్ధతుల్ని నేర్పిస్తారు.
బార్ బెండర్, స్టీల్ ఫిక్సర్స్ (400 గంటలు)
అర్హత: 5వ తరగతి
కడ్డీలను వంచేందుకు ఉక్కును ఎలా ఉపయోగించాలి? రకరకాల పరికరాలు, సాంప్రదాయక పనిముట్లు, బార్ బెండింగ్ లో యాంత్రిక పద్ధతి, స్టాక్ యార్డ్ నిర్వహణ వంటివి నేర్పిస్తారు.
ప్లంబర్ జనరల్ (410 గంటలు)
అర్హత: ఐదో తరగతి
ప్లంబింగ్ అనేది ప్రతి ఇంట్లో కీలకమైంది. అసలీ పని సక్రమంగా వచ్చినవారికి మార్కెట్లో ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఈ పనిని పక్కాగా నేర్చుకుంటే.. ఎక్కడ పనికి కుదిరినా ఆరంభంలోనే పదిహేను వేల జీతం పక్కాగా వస్తుంది. అనుభవం పెరిగే కొద్దీ జీతం పెరుగుతుంది. మరి, వీరికి ఎన్ఏసీలో ఏమేం నేర్పిస్తారంటే..
- పని ముట్లు, ప్లంబింగ్ సామగ్రి రకాలు, జీఐ, సీఐ, యూపీవీసీ పైపులు
- సీపీవీసీ, రాగి, ఆర్సీసీ, పీవీసీ, ఎస్ డబ్ల్యూజీ పైపులు
- పైపు ఫిటింగులు, జాయింట్ చేయడం, లీకేజీలను సరిచేయడం
- పారిశుద్ధ్య పరికరాల్ని బిగించడం, నిర్వహణ..
షట్టరింగ్ కార్పెంటరీ సిస్టమ్ (400 గంటలు)
అర్హత: ఐదో తరగతి
- ఫామ్ వర్క్, స్కఫోల్డింగ్ రకాల్ని బిగించడం, తొలగించడం, నిల్వ చేయడం
- పునాదులు, స్తంభాలు, దూలాలు, శ్లాబులకు సన్ షేడులకు
- స్టెయిర్ కేసులకు సంబంధించి ఫోమ్ వర్క్
- ఎత్తైన నిర్మాణాలు, స్టోరేజీ ట్యాంకులకు సంబంధించిన ఫోమ్ వర్క్
అసిస్టెంట్ సర్వేయర్ (354 గంటలు)
అర్హత: ఐదో తరగతి
- చెయిన్ సర్వే, కాంపస్ సర్వే, ప్లయిస్ టేబుల్ లెవెలింగ్
- థియోడొలైట్, టోటల్ స్టేషన్, ప్లాటింగ్
ఫాల్స్ సీలింగ్, డ్రై వాల్ ఇన్ స్టాలర్ (400 గంటలు)
అర్హత: ఐదో తరగతి
- జిప్సం, లోహం మరియు వారి లక్షణాలు
- మెటీరియల్స్- బోర్డుల రకాలు- పొడి గోడ వ్యవస్థ- టీ జంక్షన్- ఎల్ జంక్షన్
- ఫ్రేమ్ నిర్మాణం, జాయింట్ అండ్ ఫినిషింగ్
- ఫాల్స్ సీలింగ్- డిజైన్ సీలింగ్- డిజైన్ సీలింగ్ పై స్కిమ్మింగ్
- ట్విన్ గోడ- వక్రత విభజనలు- లెడ్జ్ గోడ పొడి గోడ మరమ్మత్తులు- అంచనాలు
ఆరు వేల మందికి శిక్షణ
– కె. భిక్షపతి, డైరెక్టర్ జనరల్, ఎన్ఏసీ
స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం 2020 అక్టోబరులో కొవిడ్ తర్వాత ఆరంభమైంది. అప్పట్నుంచి మార్చి 2021 దాకా సుమారు 3250 మందికి శిక్షణను అందజేశాం. ఈ ఏడాది ఎంతలేదన్నా ఆరు వేల మంద నిరుద్యోగులకు శిక్షణను అందించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ప్రస్తుతం హైదరాబాద్, జగిత్యాల శిక్షణా కేంద్రాల్లో ఉచిత వసతితో కూడుకున్న శిక్షణను అందజేస్తున్నాం. రాష్ట్ర రహదారులు, భవనాల మంత్రి సూచన మేరకు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం. ఈ క్రమంలో గిరిజన సంక్షేమ సంఘంతో కలిసి సంగారెడ్డి, మహబూబ్ నగర్, ములుగురు, కాటారంలో శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తున్నాం. కొవిడ్ వల్ల రిటైల్, ఆతిథ్య రంగాల్లో ఉద్యోగాలు కోల్పోయినప్పటికీ, నిర్మాణ రంగంలో సాంకేతిక ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బందుల్లేవని గుర్తుంచుకోవాలి.