2020 అక్టోబరు నుంచి 2021 మార్చి వరకూ ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్లు పది నుంచి పదిహేను శాతం పెరిగాయి. కాకపోతే, ఆ తర్వాత కొవిడ్ కారణంగా మార్కెట్ పూర్తిగా స్తంభించింది. గత మూడు వారాల్నుంచి కొనే నాథుడే కనిపించడం లేదు. ఇదే పరిస్థితి ఈ ఏడాది చివరి వరకూ కొనసాగుతుంది. ఇక, మార్కెట్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే ఎంత సమయం పడుతుందో తెలుసా? ఇలాంటి కీలకమైన విషయాల్ని రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా పంచుకుంటున్నారు.. నరెడ్కో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు హరిబాబు. మరి, ఆయన ఏమంటున్నారంటే..
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ప్రాజెక్టుల్ని సందర్భించేవారూ తగ్గారు. కాస్త ధైర్యం చేసి ప్రాజెక్టును చూపిద్దామన్నా ఆసక్తిగా ముందుకొచ్చేవారు కరువయ్యారు. గత మూడు వారాల్నుంచి అమ్మకాలు లేనే లేవు. అంటే జీరో సేల్స్ అన్నమాట. ప్రస్తుత పరిస్థితిలో ప్రాణాల్ని నిలుపుకోవడమే ముఖ్యం కాబట్టి.. రిస్క్ తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే, అధిక శాతం మంది బయటికి రావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి దగ్గరైనా పది లక్షలుంటే.. వాటిని రియల్ ఎస్టేట్ లో మదుపు చేయకుండా జాగ్రత్తగా దాచుకుంటున్నారు. అత్యవసరాల్లో పనికొస్తుందని దాచి పెట్టుకుంటున్నారు. అయితే, ఈమధ్య కాలంలో కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి కదా అని మీరు అడగొచ్చు. అయితే, ఇప్పటికే అడ్వాన్సులిచ్చినవి, బ్యాంకు రుణాలతో ముడి పడి ఉండటం వల్ల.. ఆయా లావాదేవీలు జరుగుతున్నాయి. అంతేతప్ప, కొత్త అమ్మకాలైతే జరగడం లేదు.
2021 దాకా మార్కెట్ కోలుకోదు
కొవిడ్ మొదటి వేవ్ క్షుణ్నంగా గమనిస్తే.. గతేడాది మార్చి నుంచి ఆరంభమై దాదాపు అక్టోబరు దాకా కొనసాగింది. నవంబరు నుంచి మార్కెట్ ఊపందుకుని మొన్నటి మార్చి వరకూ కొనసాగింది. సెకండ్ వేవ్ కూడా ఇంచుమించు మార్చిలో ఆరంభమైనా గత నెల నుంచి తీవ్ర రూపం దాల్చింది. మొదటి వేవ్లో తక్కువ మందికి ఎఫెక్టు అయ్యింది. మరణాల సంఖ్యా తక్కువే. కానీ, ఇప్పుడో దాదాపు నాలుగు రెట్లు అధికమైంది. కాబట్టి, దీన్ని ప్రభావం రియల్ రంగంపై గణనీయంగా ఉంటుంది. అపార్టుమెంట్ల కాకుండా ఏడాదికి రూ.60 నుంచి 70 కోట్ల దాకా కేవలం ప్లాట్ల లావాదేవీలను జరుపుతాను. కాబట్టి, రియలిస్టిక్ గా మాట్లాడుకుంటే 2021 డిసెంబరు దాకా రియల్ మార్కెట్ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. 2022 తర్వాతే ఊపందుకుంటుంది. జూన్ 15 వరకూ కరోనా వైరస్ డౌన్ ట్రెండ్ మొదలవుతుందని నేనయితే అనుకోవడం లేదు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్ని మినహాయిస్తే.. మిగతా జిల్లాల్లో 2020 జూన్ నుంచి 2021 మార్చి లోపు పదిహేను శాతం దాకా రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అమరావతి ఉంటుందా? లేదా? అనే అంశాన్ని పక్కన పెట్టేస్తే.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరంలో మార్కెట్ మెరుగ్గా ఉంది. నెల్లూరులో కూడా మంచి పనితీరును కనబర్చింది. అంతెందుకు పులివెందులలో లేఅవుట్ వేస్తే టక్కున అమ్ముడుపోయింది. ఆయా మార్కెట్లలో మార్కెట్ మెరుగైన రీతిలో పయనిస్తోంది. కాకపోతే, కొవిడ్ సెకండ్ వేవ్ వల్ల మళ్లీ రియల్ రంగం ప్రతికూలంగా మారింది.
అమరావతి పరిస్థితి?
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని భూములపై ఇతర ఏరియాలకు చెందిన అనేకమంది పెట్టుబడులు పెట్టారు. ఆర్బీఐతో సహా రెండు వందల యాభై సంస్థలు స్థలాల్ని కొనుగోలు చేశాయి. ప్రవాసాంధ్రులు, నెల్లూరు, రాయలసీమ, వైజాగ్, హైదరాబాద్.. ఇలా చాలామంది విపరీతంగా భూముల్ని కొన్నారు. వీరిలో చాలామంది మళ్లీ స్థలాల్ని అమ్ముకుని క్యాష్ చేసుకోవాలి కదా.. కానీ, ప్రస్తుత పరిస్థితులు అమ్ముకునేలా లేవు. అక్కడ లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక వీటిని కొనాలంటే మళ్లీ స్థానికులే కొనాల్సి ఉంటుంది. కాకపోతే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏడాదికి ఎన్ని ఇళ్లు కావాలి? అక్కడ ఎంత రిక్వయిర్మెంట్ ఉంది? మహా అయితే, ఏడాదికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఇళ్లు అమ్ముడవుతాయి. ఇందులో మూడు వంతుల మంది అపార్టుమెంట్లను కొంటారు.
ప్లాట్లు కొనుక్కుని ఇల్లు కట్టుకుందామని ఎవరైనా భావించినా, కొన్ని లేవుట్లకు అప్రోచ్ రోడ్డులు కూడా లేవు. ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే చాలా కాలం పడుతుంది. విజయవాడలో ఏడాదికి రెండు వేల ఫ్లాట్లకు డిమాండ్ ఉంది. ఇరవై మంది బిల్డర్లు ఒక ఎకరం చొప్పున ఇరవై ఎకరాల్లో.. ఇరవై అపార్లుమెంట్లను కడితే అక్కడి స్థానిక అవసరాలకు సరిపోతుంది. కాబట్టి, బయట్నుంచి వచ్చేవారు కొన్నప్పుడే ఇక్కడి మార్కెట్ బూమ్ అవుతుంది. కాకపోతే, ఇప్పుడా పరిస్థితి లేదు. గతంలో రాజధానిగా ప్రకటించినప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండింది. ఇంటి అద్దె రెండింతలైంది. భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. మళ్లీ, అలాంటి పరిస్థితులు రావాలంటే, మరో మూడు నాలుగేళ్లయినా వేచి చూడాల్సి ఉంటుంది.
విశాఖపట్నంలో..
విశాఖపట్నంలో అపార్టుమెంట్ కట్టడానికి స్థలాన్ని ఎంచుకున్నాం. ఒప్పందం కుదుర్చుకున్నాం. దీనికి సంబంధించిన వివరాల్ని అతి త్వరలో వెల్లడిస్తాం. హైదరాబాద్లో అయితే శంకర్ పల్లిలో 256 ఫ్లాట్ల అపార్టుమెంటును కడుతున్నాను. ప్రగతి నగర్లో 720 ఫ్లాట్లను కట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం.
256 ఫ్లాట్లు.. ఎవరూ రావట్లేదు..
‘‘ శంకర్ పల్లిలో 256 ఫ్లాట్లను కడుతున్నాం. కానీ, గత మూడు వారాల్నుంచి వీటిని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రోడ్డు మీద డెబ్బయ్ శాతం రాకపోకలు తగ్గిపోయాయి. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో పెద్దగా సంబంధం లేకుండా.. ప్రజలు తమంతట తామే బయటికి రావడం లేదు.’’