పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. అవి ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. అందుకే, చాలామంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030ని గతేడాది అక్టోబరులో ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ఇక ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఈవీ స్టేషన్ తప్పనిసరి సౌకర్యం కానుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇరవై ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలున్నాయి. టూ వీలర్, త్రీ వీలర్ వంటివి ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ పాలసీ ప్రకటించిన ఏడాది తర్వాత విద్యుత్తు వాహనాల అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. పైగా గేటెడ్ కమ్యూనిటీల్లో ఇందుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ను పెట్టుకునేందుకు అవసరమైన సౌకర్యాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. రాజపుష్ప, ఇండిస్, అపర్ణా, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, మైహమ్ వంటి సంస్థలు తమ ప్రాజెక్టుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రస్తుతం ఛార్జింగ్ చేసుకోవడానికి యూనిట్కు రూ.6.50 వసూలు చేస్తున్నారు. ఈ స్టేషన్లకు ప్రత్యేకంగా పెయిడ్ మీటర్ను ఏర్పాటు చేశారు. వీటికి గిరాకీని బట్టి విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.