poulomi avante poulomi avante

క్రెడాయ్‌లో యూడీఎస్ కేటుగాళ్లు?

  • క్రెడాయ్ అంటేనే దేశంలో ప్ర‌త్యేక గుర్తింపు
  • కొంద‌రు అక్ర‌మార్కుల వ‌ల్ల అప్ర‌తిష్ఠ‌పాలు
  • ఇలాగే కొన‌సాగితే క్రెడాయ్ ప్ర‌తిష్ఠ‌కు తూట్లు?
  • రాష్ట్రంలో క్రెడాయ్ ప‌రువు పోవాల్సిందేనా?
  • ఇప్ప‌టికైనా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోరా?

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌: క్రెడాయ్ అంటేనే ఒక బ్రాండ్‌.. ప్ర‌త్యేక గుర్తింపు.. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో ఒక ఇమేజ్‌. అందుకే, విదేశాల్లో నివ‌సించే ప్ర‌వాసులూ క్రెడాయ్ స‌భ్య‌త్వం ఉన్న బిల్డ‌ర్ల వ‌ద్ద ఇంటిని కొన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఈ స్థాయికి చేరుకునేందుకు క్రెడాయ్ నాయ‌క‌త్వం కొన్నేళ్ల నుంచి విశేషంగా కృషి చేసింది. అందుకే, ఏ దేశంలోకి అడుగుపెట్టినా.. క్రెడాయ్‌కి కార్పెట్ వెల్కం ల‌భిస్తుంది. ఈ సంఘానికి మ‌న‌దేశంలో 21 రాష్ట్రాల్లో.. 217 న‌గ‌రాల్లో ఛాప్ట‌ర్లు ఉన్నాయి. ఇందులో ప‌ద‌మూడు వేల మందికి పైగా డెవ‌ల‌ప‌ర్లు స‌భ్యులుగా ఉన్నారు. దేశీయ నిర్మాణ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న క్రెడాయ్ బ్రాండ్ కు తూట్లు ప‌డే ప్ర‌మాదం ఏర్ప‌డిందా? కేవ‌లం కొంద‌రు బిల్డ‌ర్ల అక్ర‌మ వ్య‌వ‌హారం వ‌ల్ల మొత్తం క్రెడాయ్ సంఘానికే చెడ్డ పేరు వ‌స్తుంటే ఎందుకు సంఘం నిమ్మ‌కునీరెత్త‌కుండా వ్య‌వ‌హ‌రిస్తోంది? ఏదో తూతూమంత్రంగా ఒక ప‌త్రికా స‌మావేశాన్ని నిర్వ‌హిస్తే స‌రిపోతుందా? హైద‌రాబాద్‌లో ఎవ‌రి వ‌ల్ల క్రెడాయ్ పేరు ప్ర‌ఖ్యాత‌ల‌కు భంగం వాటిల్లే దుస్థితి ఏర్ప‌డుతోంది?

క్రెడాయ్ సంఘంలో ఏ బిల్డ‌ర్ అయినా స‌భ్య‌త్వం తీసుకోవాలంటే.. కోడ్ ఆఫ్ కండ‌క్ట్ మీద సంత‌కం పెట్టాల్సిందే. దీన్ని మీద సంత‌కం పెట్ట‌క‌పోతే అస‌లు క్రెడాయ్‌లో స‌భ్య‌త్వం ల‌భించ‌దు. అంటే, ప్ర‌తిఒక్క క్రెడాయ్ బిల్డ‌ర్‌ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా నిర్మాణాలు చేప‌ట్టాల్సిందే. స‌భ్య‌త్వం తీసుకునేట‌ప్పుడే హామీ ప‌త్రం మీద సంత‌కం చేస్తారు. పైగా, స్థానిక సంస్థ‌ల నుంచి త‌మ నిర్మాణానికి అనుమ‌తి వ‌చ్చిన త‌ర్వాతే ప్లాట్ల బుకింగులు తీసుకుంటాన‌ని హామీ ప‌త్రంలో రాసి ఉంటుంది. అగ్రిమెంట్ చేసేట‌ప్పుడే అనుమ‌తుల‌కు సంబంధించిన ప్ర‌తిఒక్క ప‌త్రాన్ని కొనుగోలుదారుల‌కు చూపెడ‌తాన‌ని.. ఒక‌వేళ అందుకు సంబంధించిన కాపీలు కావాలన్నా అంద‌జేస్తాన‌నే నిబంధ‌న క్రెడాయ్ కోడ్ ఆఫ్ కండ‌క్టులో రాసి ఉంటుంది. ఒక‌వేళ ఏ బిల్డ‌ర్ అయినా, శాంక్ష‌న్ ప్లాన్ కంటే ముందే బుకింగ్ చేయాల‌నుకుంటే, ఆ విష‌యాన్ని కొనుగోలుదారుల‌కు త‌ప్ప‌క తెలియ‌జేయాలి. ఆయా అంశాన్ని అగ్రిమెంట్‌లో కూడా ప్ర‌త్యేకంగా పొందుప‌ర్చాల్సి ఉంటుంది.

బ‌య్య‌ర్ల‌తో వివాదం ఏర్ప‌డితే?

ఒక‌వేళ డెవ‌ల‌ప‌ర్ మ‌రియు కొనుగోలుదారుడి మ‌ధ్య‌లో ఏదైనా వివాదం త‌లెత్తితే, క్రెడాయ్ సంఘం ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి. ఇందుకోసం ప్ర‌త్యేకంగా క‌న్సూమ‌ర్ రెడ్రెస‌ల్ ఫోరంను ఏర్పాటు చేయాలి. ఇక్క‌డ వివాదం ప‌రిష్కారం కాని ప‌క్షంలో.. బాధితుడు వినియోగ‌దారుల ఫోరం కానీ కోర్టును కానీ సంప్ర‌దించ‌వ‌చ్చు. మ‌రి, తెలంగాణ రాష్ట్రంలోని క్రెడాయ్ ఛాప్ట‌ర్ల‌లో ఇలాంటి ఫోరంలు ఎన్ని ఉన్నాయో.. అందులోని స‌భ్యులెవ‌రో కూడా పెద్ద‌గా తెలియ‌దు. క్రెడాయ్ కు చెందిన కొంద‌రు బిల్డ‌ర్లే.. హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప‌లు ప‌ట్ట‌ణాల్లో.. యూడీఎస్‌, ప్రీలాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్ల విక్ర‌యాలు జ‌రుపుతున్నారు. వీరి నిర్వాకం వ‌ల్ల సుమారు తొంభై శాతం డెవ‌ల‌ప‌ర్లు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు, కొండాపూర్‌లో ఒక క్రెడాయ్ డెవ‌ల‌ప‌ర్ ముప్ప‌య్ అంత‌స్తుల ఆకాశ‌హ‌ర్మ్యంలో చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.8000 అటుఇటుగా విక్రియిస్తుంటే.. అక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో కొంద‌రు క్రెడాయ్ బిల్డ‌ర్లు.. యూడీఎస్‌, ప్రీలాంచుల్లో చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.4000 నుంచి రూ.5000 మ‌ధ్య‌లో విక్ర‌యిస్తున్నారు. ఫ‌లితంగా, ఒక అక్ర‌మ బిల్డ‌ర్ మ‌రో స‌క్ర‌మ డెవ‌ల‌ప‌ర్‌ని ఇబ్బంది పెడుతున్నారు.

గ‌త కొంత‌కాలం నుంచి ఈ అక్ర‌మ తంతు కొన‌సాగుతున్నా.. తెలంగాణ రాష్ట్రంలోని క్రెడాయ్ నాయ‌క‌త్వం పెద్ద‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లాలు క‌నిపించ‌లేదు. యూడీఎస్ కు వ్య‌తిరేకంగా ఒక‌ట్రెండు చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌టికీ, మ‌రెందుకో కానీ ఆత‌ర్వాత పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. స‌రిగ్గా, అదే స‌మ‌యంలో యూడీఎస్‌, ప్రీలాంచ్ బిల్డ‌ర్ల సంఖ్య హైదరాబాద్‌లో గ‌ణ‌నీయంగా పెరిగింది. ఈ అక్ర‌మ వ‌సూళ్ల ప‌ర్వం రాష్ట్ర‌మంత‌టా పాకింది. దీంతో, ఈ త‌తంగాన్ని దారిలోకి తేవడానికి నానా ఇబ్బందులు ప‌డాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. యూడీఎస్‌, ప్రీలాంచుల వ‌ల్ల ప‌రిస్థితి ఎంత దిగ‌జారిందంటే.. గ‌త రెండు నెల‌ల్నుంచి రెరా అనుమ‌తి తీసుకున్న డెవ‌ల‌ప‌ర్ల‌కు అమ్మ‌కాలు పెద్ద‌గా లేవు. ఇలా అక్ర‌మ అమ్మ‌కాల ప‌రంప‌ర ముందుముందూ కొన‌సాగితే.. హైద‌రాబాద్ నిర్మాణ రంగం నిర్వీర్యమ‌వ్వ‌డం ఖాయం. మ‌రి, క‌ళ్ల ముందే హైద‌రాబాద్ నిర్మాణ రంగం కుప్ప‌కూలే ప‌రిస్థితి ఎదుర‌వుతుంటే.. ఒక బాధ్య‌త గ‌ల సంఘంగా క్రెడాయ్ చేతులు ముడుచుకుని కూర్చుంటుందా?

క్రెడాయ్ ఎందుకు నియంత్రించట్లేదు?

క్రెడాయ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. సంఘ స‌భ్యులెవ్వ‌రైనా స్థానిక సంస్థ‌ల నుంచి అనుమ‌తి వ‌చ్చిన త‌ర్వాతే అమ్మ‌కాలు జ‌రిపాలి. అందుకు సంబంధించిన అగ్రిమెంట్ కొనుగోలుదారుల‌తో చేసుకోవాలి. కానీ, గ‌త కొంత‌కాలం నుంచి కొంద‌రు క్రెడాయ్ బిల్డ‌ర్లు ఈ నిబంధ‌న‌ను తుంగ‌లో తొక్కి.. అనుమ‌తి రాక ముందే.. కొనుగోలుదారుల నుంచి వంద శాతం సొమ్ము తీసుకుని ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నారు. మ‌రి, ఇలాంటి బిల్డ‌ర్ల‌ను క్రెడాయ్ సంఘం ఎందుకు నియంత్రించ‌డం లేదు? వీరిని దారిలోకి తేవ‌డంలో ఎందుకు విఫ‌లం అవుతోంది? అస‌లెందుకు ఇలాంటి యూడీఎస్ కేటుగాళ్ల‌తో స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌డం లేదు? వారంతా త‌ప్పుడు మార్గంలో ప‌యనిస్తున్నార‌ని.. అలా చేయ‌డం క్రెడాయ్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధమ‌ని ఎందుకు గొంతెత్తి చెప్ప‌లేక పోతుంది? అస‌లెక్క‌డ పొర‌పాటు జ‌రుగుతోంది? ఇప్ప‌టికైనా, యూడీఎస్ మ‌రియు ప్రీలాంచ్‌లో అమ్మ‌కాలు జ‌రుపుతున్న సంస్థ‌ల‌ను తెలంగాణ‌కు చెందిన క్రెడాయ్ సంఘాలు దారిలోకి తేవాలి. లేక‌పోతే, క్రెడాయ్ ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారిపోయే ప్ర‌మాద‌ముంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles