- ఆ రెండూ ఇష్టమంటున్న శివానీ రాజశేఖర్
‘జీవితంలో ఇల్లు అనేది అతి పెద్ద విషయం. మీరు కొత్త ఇంటిని కట్టుకుంటున్నా లేదా కొత్త ఇంటికి వెళుతున్నా అది మీ జీవితంలో జరిగే అది పెద్ద, మంచి విషయాలకు సంకేతం. బయట జరిగే గందరగోళాల నుంచి ఆశ్రయం కల్పించేది మన కలల ఇల్లు మాత్రమే. మనకు కావాల్సిన సౌకర్యాలను వెతుక్కునేది అక్కడే’ అని అంటోంది ‘అద్భుతం’ నటి శివానీ రాజశేఖర్. జీవితంలో ఎన్నో అంశాలకు ఇల్లు అనేది ప్రాతినిథ్యం వహించాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. తనన కలల నివాస గృహం ఎక్కడ ఎలా ఉండాలనే పలు విషయాలపై ఆమె రియల్ ఎస్టేట్ గురుతో ముచ్చటించింది. ఇంటికి సంబంధించి రంగులు అనేవి చాలా ముఖ్యమని చెబుతోంది. ఇంటికి వన్నెలద్దేవి ఆకర్షణీయమైన రంగులు మాత్రమేనని స్పష్టంచేసింది. ‘నాకు మినిమలిస్టిక్ డెకర్ అంటేనే ఇష్టం. అది నా సొంత భావోద్వేగాలను ప్రతిఫలింపజేస్తుంది. సింప్లిసిటీ అనేది అన్ని వేళలా ఉత్తమం. నా ఇంటిని స్టైల్ గా ఉంచడం కోసం ఇష్టం వచ్చినట్టు డెకరేషన్ చేయాలనుకోను’ అని పేర్కొంది.
ఇంటికి రంగులు ఎంత ముఖ్యమో లైటింగ్ కూడా అంతే ముఖ్యమని శివానీ వెల్లడించింది. అందమైన ఇంటికి లైట్లు ప్రధాన ద్వారం వంటివని అభివర్ణించింది. ఫర్నిచర్, ఫ్లోరింగ్ పైనే కాకుండా లైటింగ్ పై కూడా మనం ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉటుందని అభిప్రాయపడింది. ఇంటి అలంకరణకు సంబంధించి ఈ విషయాన్ని చాలామంది విస్మరిస్తారని పేర్కొంది. ఇంట్లో కాంతి కోసమే లైట్లు అనే ప్రాథమిక భావనకు కాలం చెల్లిందని, ప్రస్తుతం లైటింగ్ అనేది అప్పటికి, ఇప్పటికీ చాలా తేడా ఉందని వివరించింది. ‘నా కలల ఇల్లు పర్యావరణానికి అనుకూలంగా ఉండాలి. నా గదిలో మొక్కలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. గులకరాళ్లతో కూడిన చిన్న జలపాతం సెటప్ నా ఇంటి డెకరేషన్ కు అదనపు ఆకర్షణగా ఉంటుంది’ అని శివానీ తెలిపింది. ఇంటికి సంబంధించిన కలలన్నీ తన స్వీయ ఆకాంక్షలు, ఆలోచనలను సూచిస్తాయని పేర్కొంది. అలాగే తన కలల ఇల్లు ఎలా ఉండాలో చెబుతూ.. ఇంట్లోని గదులన్నీ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలని అభిప్రాయపడింది. తనకు విల్లా అయినా అపార్ట్ మెంట్ అయినా పర్వాలేదని, కానీ పొరుగువారు ఎలా ఉన్నారనేది చాలా ముఖ్యమైన అంశమని చెప్పింది. కమ్యూనిటీ అనేది తనను ఎంతో ఉత్తేజపరుస్తుందని.. అయితే విల్లా చుట్టూ తనకు మంచి కంపెనీ లభించకపోవచ్చని విశ్లేషించింది. సినిమాలు చూడటం తనకు చాలా ఇష్టమని, అందువల్ల హోమ్ థియేటర్ రూంలోనే ఎక్కువసేపు గడుపుతానని శివానీ తెలిపింది.
ప్రపంచంలో మీ కలల ఇంటిని ఎక్కడ కట్టుకోవాలని భావిస్తున్నారని అడగ్గా.. ‘ఆమ్ స్టర్ డ్యామ్’ అని బిగ్గరగా చెప్పింది. ‘నేను ఇప్పటివరకు వెళ్లిన ప్రదేశాలలో అది చాలా సంతోషకరమైన ప్రదేశం. చిన్న షికారు కోసం అక్కడకు వెళ్లాం.. అంతే అక్కడి ప్రజలు, ఆ ప్రదేశంతో మమేకమైపోయాం’ అని వివరించింది. ఆమ్ స్టర్ డ్యామ్ లో 2025 నుంచి చేపట్టబోయే కొత్త హౌసింగ్ ప్రాజెక్టులలో తప్పనిసరిగా 20 శాతం కలప లేదా పర్యవరణహిత మెటీరియల్స్ వినియోగించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఇక శివానీకి మనాలీ కొండలన్నా ఇష్టమే. తన తండ్రి సినిమా షూటింగ్ కోసం అక్కడకు వెళ్లి, ఆ ప్రదేశంతో ప్రేమలో పడిపోయినట్టు చెప్పింది. అందమైన గార్డెన్, హోం థియేటర్, విలాసవంతమైన బాత్ టబ్, ఆవిరి గదితో కూడిన స్పా.. ఇవీ తనన కలల ఇంట్లో ప్రధానంగా ఉండాల్సిన నాలుగు అంశాలని శివానీ వెల్లడించింది.
శివానీ కుటుంబం సినిమా నేపథ్యానికి చెందినది కావడం వల్ల ఇంట్లో అందరూ ఏదో ఒక షూటింగ్ తో బిజీగా ఉంటారు. అందువల్ల వారిలో ఎవరూ ఇంటీరియర్ డిజైనింగ్ పై శ్రద్ధ పెట్టే పరిస్థితి లేదు. అయితే, తనన కలల ఇంటిని నిర్మించుకునేటప్పుడు తప్పకుండా దీనికి కొంత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు శివానీ తెలిపింది. ‘ఇందుకు చాలా ఓపిక కావాలి. చాలా ఆలోచనలున్నాయి. కానీ వాటిని అమలు చేయడానికి తక్కువ ఓపిక ఉంటోంది. ఇక నా బాల్కనీ గురించి పిచ్చి ఆలోచనలున్నాయి. నాకు సమంతా ఇల్లంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆమె చేస్తున్న ఇంటి పంటను ఎంతగానో ఆరాధిస్తాను’ అని శివానీ ముగించింది.