మార్కెట్లో కొందరు అక్రమార్కులు తయారయ్యారు. నిర్మాణ రంగంలో ఏమాత్రం అనుభవం లేకుండానే కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభిస్తున్నారు. రేటు తక్కువ అంటూ యూడీఎస్, ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. కొంపల్లిలో సాధారణ బిల్డర్లు చదరపు అడుక్కీ రూ.4000 నుంచి రూ.5000కు విక్రయిస్తుంటే.. అందులో సగం ధరకే వీరు విక్రయిస్తున్నారు. కొందరైతే చదరపు అడుక్కీ రూ.2000కు అటుఇటుగా అమ్ముతున్నారు. స్థలం విలువ, నిర్మాణ వ్యయం, అనుమతులకు అయ్యే ఫీజు, సంస్థ నిర్వహణ ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకుంటే..
ఇంత తక్కువ రేటుకు ఫ్లాట్లను విక్రయించడం చాలా కష్టం. పైగా, రెరా ప్రకారం అపార్టుమెంట్లు కట్టిన తర్వాత బిల్డరే దాదాపు ఐదేళ్ల పాటు నిర్మాణపరమైన లోపాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలాంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని.. అనుభవజ్ఞులైన అధిక శాతం డెవలపర్లు నాణ్యతలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణాల్ని చేపడుతున్నారు. కానీ కొందరు యూడీఎస్, ప్రీలాంచ్ బిల్డర్లు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. వీరి దృష్టి కొనుగోలుదారుల్నుంచి సొమ్ము వసూలు చేయడం మీదే ఉంది తప్ప నిర్మాణాల్ని పూర్తి చేయడంపై లేదు. కాబట్టి, బయ్యర్లు ఇలాంటి వాటిలో ఫ్లాట్లు కొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే, వీరి కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.