- విదేశాల్లో సంపాదించిన మొత్తంపై ఐటీ ట్రిబ్యునల్ స్పష్టీకరణ
ప్రవాస భారతీయులు విదేశాల్లో సంపాదించిన సొమ్ముతో మనదేశంలో ఫ్లాట్ కొనుగోలు చేస్తే అది పెట్టుబడిగానే పరిగణించాలని ఆదాయ పన్ను ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ముంబై బెంచ్ స్పష్టం చేసింది. భారత్ లో స్థిరాస్థిపై వచ్చే ఆదాయం వేరు, విదేశాల్లో సంపాదించిన ఆదాయం వేరుగా పరిగణించాలని.. విదేశాల్లో సంపాదించిన మొత్తాన్ని ఇక్కడ పెట్టుబడి పెడితే అది పన్ను పరిధిలోకి రాదని పేర్కొంది. వివరించని పెట్టుబడులు లేదా వివరించని ఆదాయం కింద పన్ను వసూలు చేయడం ఇక్కడ వర్తించదని తేల్చి చెప్పింది. ట్రిబ్యునల్ వెలువరించిన ఈ తీర్పు చాలామంది ఎన్నారైలకు ఉపశమనం కలిగించనుంది.
యూఏఈలో నివాసం ఉంటున్న రాజీవ్ ఘాయ్ గత మూడు దశాబ్దాలా ముంబైలో రూ.8.5 కోట్ల వ్యయంతో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన చెల్లింపులన్నీ సక్రమ మార్గంలోనే అన్ని రకాల డాక్యుమెంట్లతో చేశారు. అయితే, ఆ బిల్డర్ గ్రూప్ పై ఆదాయపన్ను సోదాలు జరిపినప్పుడు రాజీవ్ ఘాయ్.. సదరు బిల్డర్ కు అక్రమంగా రూ.2.5 కోట్లు చెల్లించాడని.. అంతేకాకుండా రూ.4.47 లక్షల నగదు వడ్డీ కింద పొందాడని ఐటీ అధికారులు ఆరోపించారు. ఈ మొత్తాన్ని వివరించని పెట్టుబడి, వివరించని ఆదాయం కింద పరిగణించారు. దీంతో ఈ సెక్షన్ మేరకు 60 శాతం పన్నుతో పాటు 25 శాతం సర్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రాజీవ్ ఐటీఏటీని ఆశ్రయించగా.. ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఆయన పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఆదాయంగానే పరిగణించినప్పటకీ, భారత్ లో సంపాదించిన మొత్తం కానందున ఇక్కడ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.