- లాయర్ కు సుప్రీంకోర్టు ప్రశ్న
సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కు సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపాలంటూ ఆయన గతంలో వాదనలు వినిపించారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఢిల్లీలో కాలుష్యం మరింత పెరుగుతుందని అప్పుడు వాదించారు. తాజాగా ఆయన డెవలపర్లు, బిల్డర్ల తరపున వాదనలు వినిపించడానికి వచ్చారు. ఢిల్లీలో నిర్మాణరంగ కార్యకలాపాలపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ లో వాదించడానికి ఆయన వచ్చారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని వికాస్ అభ్యర్థించారు. నిర్మాణ రంగ కార్యకలాపాలపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. ‘ఒకవైపు కాలుష్యాన్ని నివారించాలంటూ పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు. మరో వైపు నిర్మాణరంగ కార్యకలాపాలు కొనసాగించాలంటూ బిల్డర్ల తరపున వాదనలు వినిపించడానికి వచ్చారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోనిద్దాం’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వికాస్ పిటిషన్ ను వెంటనే విచారణకు స్వీకరించలేమని పేర్కొన్నారు. వికాస్ సింగ్ గతంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా వాదించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం పెరుగుతుందని.. నగర ప్రజల జనాభా కంటే సెంట్రల్ విస్టా ముఖ్యమా అని వాదనలు వినిపించారు. ఇప్పుడు ఆయనే నిర్మాణ రంగ కార్యకలాపాలపై నిషేధం ఎత్తవేయాలంటూ వాదనలు వినిపించడానికి రావడంతో సుప్రీంకోర్టు ఆ వ్యవహారాన్ని ప్రస్తావించింది.