- చట్టమార్పిడికి ప్రభుత్వం సన్నాహాలు
భూమార్పిడి ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా కర్ణాటక చర్యలు చేపట్టింది. ఈ మేరకు భూ రెవెన్యూ చట్టంలో మార్పులు చేస్తోంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు చేసే ప్రక్రియ మరింత వేగంగా జరగనుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడానికి, కొత్త ఉద్యోగాలు రావడానికి దోహదం చేస్తుందని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోకా పేర్కొన్నారు. కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ చట్టం, 1964 ప్రకారం.. తొలుత వ్యవసాయ భూమి యజమానులు తమ భూమిని వ్యవసాయం నుంచి వ్యవసాయేతర భూమిగా మార్పు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ప్లానింగ్ అధికారులు దానిని నివాస, పరిశ్రమ, విద్య, వాణిజ్య తదితర భూమిగా నిర్ధారిస్తారు.
అయితే, ఈ కఠిన నిబంధనల వల్ల కర్ణాటకలో తయారీ పరిశ్రమ విస్తరించడంలో ఒడుదొడుకులు ఎదురవుతున్నాయి. వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలంటే చాలా కష్టమయ్యేది. చివరకు వ్యవసాయ భూమి యజమాని సైతం తన భూమిని వ్యవసాయేతర కార్యకలాపాలకు వినియోగించే పరిస్థితి ఉండేది కాదు. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియను సులభతరం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. ఎవరైనా తమ భూమి వినియోగాన్ని మార్పిడి చేసుకోవాలంటే తక్కువ సమయంలో దానిని పూర్తిచేసేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇందుకోసం చట్ట సవరణ చేయాల్సి ఉందని.. ప్రస్తుతం దీనిపై చర్చలు సాగుతున్నాయని.. సాధ్యమైనంత త్వరగా దీనిని కార్యరూపం దాల్చేలా చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.