హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) గ్రీనరీ పెంపకం మన అందరికీ ఆదర్శంగా ఉందని అటవీశాఖ అడిషనల్ పిసిసిఎఫ్ సునీత. ఎం భగవత్ అన్నారు. మంగళవారం అటవీశాఖ స్పెషల్ ఆఫీసర్లు హెచ్ఎండిఎ అభివృద్ధి చేసిన బీబీనగర్, జలాల్ పూర్ అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ లను అటవీశాఖ జిల్లా అధికారులు(డిఎఫ్ఓ), స్పెషల్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు, సిబ్బంది అనుసరించిన పద్ధతులను అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్ జిల్లా అటవీ శాఖ అధికారులకు, స్పెషల్ ఆఫీసర్లకు వివరించారు.
అర్బన్ ఫారెస్ట్రీ బ్లాకుల్లో నాటిన మొక్కలు వాటి మధ్య ఉన్న స్థల వినియోగం, మొక్కలకు అందించే నీటి పరిమాణం, ఫారెస్ట్ బ్లాకుల్లో పనిచేసే వర్కర్ల నైపుణ్యం వంటి అంశాలను డైరెక్టర్ ప్రభాకర్ వివరించారు. హెచ్ఎండిఏ పరిధిలో ఇంతటి పచ్చదనం(గ్రీనరీ) పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ పర్యవేక్షణ, ఉద్యోగులు, సిబ్బంది, కార్మికుల సమిష్టి కృషి ఫలితమేనని డైరెక్టర్ ప్రభాకర్ తెలియజేశారు.
వర్క్స్ టార్గెెట్స్, టైమ్, ప్రోగ్రెస్ విషయంలో మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ ఎప్పటి కప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించడం వల్ల అందరూ బాధ్యతాయుతంగా పనిచేయడం వల్ల అభివృద్ధి సాధ్యం అయ్యిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓలు డి.వి.రెడ్డి(యాదాద్రి), జానకిరామ్(రంగారెడ్డి), శ్రీధర్(సిద్దిపేట్), వెంకటేశ్వరరావు(సంగారెడ్డి), ఎఫ్.డి.ఓలు విజయానంద్ రావు(శంషాబాద్), మక్ సూద్ (ఫ్లయింగ్ స్క్వాడ్- హైదరాబాద్), హెచ్ఎండీఏ అసిస్టెంట్ డైరెక్టర్ (అర్బన్ ఫారెస్ట్రీ) పి.రాములు, ఫారెస్ట్ మేనేజర్ (ఎఫ్ఎం) మంజుల తదితరులు పాల్గొన్నారు.