- కేవలం భూముల వేలం వేయడం కాదు..
- ఆదాయం కోసం ప్రత్యామ్నాయాలపై దృష్టి
- రెరా నిబంధనల్ని అతిక్రమించే బిల్డర్ల నుంచి జరిమానా వసూలు చేయాలి
- ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానా
- ఈ అంశంపై దృష్టి సారిస్తే ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు
- చీఫ్ సెక్రటరీ ఈ అంశాన్ని పట్టించుకోవాలి
( కింగ్ జాన్సన్ కొయ్యడ)
తెలంగాణ ప్రజల సాగునీటి, తాగునీటి వెతల్ని తీర్చేందుకు ప్రభుత్వమెంతో శ్రమిస్తోంది. ఇంతటి భారీ లక్ష్యానికి చేరుకోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇందుకోసం భారీ స్థాయిలో నిధులు కావాలి. వాటిని సమీకరించాలంటే ప్రజల మీద పన్నుల భారం వేయాలి. కానీ, ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి భారం మోపకూడదనే మంచి ఆలోచనల్ని కలిగి ఉంది. ఇలాగైతే, నీటి ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులెలా వస్తాయి? ఇందుకోసం ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉన్నాయా? ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎప్పుడైనా వినూత్నంగా ఆలోచించారా?
తెలంగాణలో సాగు, తాగు నీటి కష్టాలను తీర్చేందుకు అవసరమయ్యే సొమ్మును సమీకరించేందుకు ప్రభుత్వం హైదరాబాద్లో భూములను వేలం వేస్తోంది. ఇందుకోసం హెచ్ఎండీఏ, హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములపై దృష్టి సారిస్తోంది. ఇలా వేలం ద్వారా వచ్చే సొమ్ము గురించి ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారే తప్ప కొత్తగా ఆలోచించడం లేదనిపిస్తోంది. ఉదాహరణకు, తెలంగాణ రెరా అథారిటీ మన రాష్ట్రంలో 2018లో ఏర్పాటైంది. ఈ చట్ట ప్రకారం.. తెలంగాణలో 500 గజాల కంటే అధిక విస్తీర్ణం లేదా 8 కంటే అధిక ఫ్లాట్లను నిర్మించే ప్రతిఒక్క బిల్డర్ రెరా కింద నమోదు చేసుకోవాల్సిందే. కానీ, ఇప్పటివరకూ ఎంతమంది రెరాలో నమోదయ్యారు? మహా అయితే మూడు వేలకు అటుఇటుగా ప్రాజెక్టులు నమోదయ్యాయి. రెరా సైటులో 4002 ప్రాజెక్టులు చూపిస్తున్నప్పటికీ.. అందులో బ్లాకుల వారీగా పలు సంస్థలు నమోదు చేసుకున్నాయి.
ప్రాజెక్టు విలువలో 10 శాతం..
రెరా నుంచి అనుమతి లేకుండా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తే.. ప్రాజెక్టు మొత్తం విలువలో పది శాతం జరిమానాను వసూలు చేయాలనే నిబంధన ఉన్నది. ఆయా నిర్మాణం చేపడుతున్న స్థలం మీద కాదు.. మొత్తం ప్రాజెక్టు విలువలో పది శాతమని గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వందలాది ప్రాజెక్టులు రెరా అనుమతి లేకుండానే ప్రీ సేల్స్, యూడీఎస్లో విక్రయిస్తున్నారు. ఇందులో ఒక సాహితి సంస్థనే తీసుకుంటే.. అమీన్పూర్లో పది ఎకరాల్లో దాదాపు 3,600 ఫ్లాట్లను నిర్మించాలని అమ్మకాల్ని చేపట్టింది. నాలుగేళ్లయినా ఇప్పటివరకూ ప్రాజెక్టు నిర్మాణ పనులే ఆరంభం కాలేదు. కానీ, దాదాపు పదిహేను వందల ఫ్లాట్లను విక్రయించేసింది. మరి, ఇలాంటి సంస్థల నుంచి రెరా అథారిటీ ఎందుకు జరిమానాను వసూలు చేయట్లేదు? ఇలాంటి అక్రమార్కుల్ని ఎందుకు గాలికొదిలేస్తుంది? రెరా నుంచి అనుమతి తీసుకోకుండా అమ్మకాలు చేపడితే ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానా వసూలు చేయాలని రెరా చట్టంలో పేర్కొన్నారు. అలాంటప్పుడు, సాహితి సంస్థ చేపట్టిన 3600 ఫ్లాట్లను పరిగణనలోకి తీసుకుని.. ఒక్క ఫ్లాట్ విలువ రూ.30 లక్షల చొప్పున లెక్కించినా.. మొత్తం ప్రాజెక్టు విలువ వెయ్యి కోట్లపైమాటే. ఇందులో పది శాతం జరిమానా అంటే, కనీసం రూ.100 కోట్లు వసూలు చేయవచ్చు. మరి, ఇలాంటి నీతిమాలిన కంపెనీల నుంచి ప్రభుత్వం ఎందుకు ముక్కుపిండి జరిమానాను వసూలు చేయట్లేదు?
కేవలం సాహితి సంస్థ ఒక్కటే కాదు.. హైదరాబాద్లో వాసవి, అలయాన్స్, ఈఐపీఎల్, హాల్ మార్క్, భువనతేజ, ఐరా రియాల్టీ, ఆర్జే గ్రూప్ వంటి అనేక సంస్థలు ప్రీలాంచ్, యూడీఎస్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి. ఇలాంటివి ఎంతలేదన్నా వందకు పైగానే ఉంటాయి. ఈ సంస్థలపై కొనుగోలుదారులు ఇచ్చిన ఫిర్యాదులు రెరా అథారిటీ వద్ద ఎక్కువగానే ఉన్నాయి. మరి, ఇలాంటి అక్రమార్కులపై ప్రభుత్వం కఠిన చర్యల్ని తీసుకుంటే.. నిర్మాణ రంగంలో పారదర్శకత పెరుగుతుంది. జరిమానాల రూపేణా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం కూడా వస్తుంది. ఈ సొమ్మును తెలంగాణలో కనీసం ఒకట్రెండు సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల కోసమైనా వినియోగించవచ్చు. కనీసం ఇప్పుడైనా ఈ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే ఉత్తమం.