- యూడీఎస్, ప్రీలాంచ్ ప్రమోటర్లపై క్రిమినల్ చర్యలు
- సీఎస్ సోమేష్ కుమార్ హెచ్చరిక
- ప్రీలాంచ్ అక్రమార్కుల ఆటలు సాగవిక
- ప్రీలాంచ్ అమ్మకాల్ని నిరోధించేందుకు ప్రత్యేక కమిటీ
- పాల్గొన్న ఎంఏయూడీ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్
కింగ్ జాన్సన్ కొయ్యడ: రెరా నిబంధనల్ని ఉల్లంఘించి యూడీఎస్, ప్రీలాంచ్ అమ్మకాల్ని చేపట్టే వ్యక్తులు, సంస్థలు, డెవలపర్లను కఠినంగా శిక్షిస్తామని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఆయన క్రెడాయ్ హైదరాబాద్, క్రెడాయ్ తెలంగాణ, ట్రెడా, టీబీఎఫ్, నరెడ్కో వెస్ట్ జోన్ తదితర నిర్మాణ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లేఅవుట్లు, అపార్టుమెంట్లను కట్టే ప్రతిఒక్కరూ రెరా నిబంధనల్ని కచ్చితంగా పాటించాల్సిందేనని తెలిపారు. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ వంటి సోషల్ మీడియాల ద్వారా అధిక శాతం మంది యూడీఎస్, ప్రీలాంచ్ అమ్మకాల్ని సాగిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం.. ఇక నుంచి వీటిపై నిఘా పెట్టాలని నిర్ణయానికొచ్చింది.
రెరాలో నమోదైన ప్రాజెక్టుల్ని మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజల్లో అవగాహన పెంచేందుకు క్రెడాయ్ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఈ మేరకు పురపాలక, రిజిస్ట్రేషన్, ఐఅండ్‌పీఆర్ శాఖలతో కలిసి ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. దీంతో మోసపూరిత బిల్డర్ల చేతిలో మోసపోకుండా ప్రజల్ని కాపాడే అవకాశం ఉంటుందని భావిస్తోంది.
గత కొంతకాలం నుంచి హైదరాబాద్‌లో రెరా ప్రాజెక్టుల్లో అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీనికి ప్రధాన కారణం యూడీఎస్, ప్రీలాంచ్ అమ్మకాలేనని క్రెడాయ్ హైదరాబాద్, ట్రెడా, టీబీఎఫ్, క్రెడాయ్ తెలంగాణ వంటి నిర్మాణ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. ఈ క్రమంలో ప్రత్యేక విలేకరుల సమావేశాన్ని కూడా నిర్వహించాయి. ఇటీవల కాలంలో క్రెడాయ్ హైదరాబాద్ మరియు తెలంగాణ నిర్మాణ సంఘాలు.. నిర్మాణ రంగానికి చెందిన పెద్దలతో ప్రత్యేకంగా సమావేశాన్ని కూడా నిర్వహించారు.
ఎన్‌సీఆర్ రీజియన్‌లో జరిగినట్లు హైదరాబాద్‌లో జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ క్రమంలో భాగంగా సమస్య తీవ్రతను పక్కాగా అంచనా వేసి.. ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకెళ్లాలని నిర్ణయించారు. నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టేందుకు నిర్మాణ సంఘాలన్నీ కలిసికట్టుగా పని చేయాలనే నిర్ణయానికొచ్చారు.