పర్యావరణ అనుకూల భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు గ్రీన్ రేటెడ్ భవంతులకు ఇంటెన్సివ్స్ ఇవ్వాలని కేరళ సర్కారు నిర్ణయించింది. నిర్మాణానికి ఎంచుకున్న భూమి నుంచి దానిని పూర్తిచేసే వరకు వివిధ అంశాలు ప్రాతిపదికగా తీసుకుని తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు ఆస్తి పన్ను, స్టాంపు డ్యూటీ వంటి వాటిలో రాయితీ కూడా ఇస్తారు. భవనాలను ఓ కుటుంబం నివసించే 200 చదరపు మీటర్ల లోపు.. 200 చదరపు మీటర్ల పైన మొదటి కేటగిరీగా విభజించగా.. అపార్ట్ మెంట్ భవనాలు, పారిశ్రామిక భవనాలు, ఇతర భవనాలు అని మొత్తం నాలుగు కేటగిరీలుగా చేశారు.
ఆపై గ్రీన్ రేటింగ్ చార్ట్ ఆధారంగా వివిధ అంశాలకు సంబంధించి ఆయా భవనాలకు పాయింట్లు ఇస్తారు. అనంతరం ఆయా పాయింట్లను బట్టి గ్రేడ్ ఏ లేదా గ్రేడ్ బి ఖరారు చేస్తారు. ఏ గ్రేడ్ భవనాలకు గరిష్టస్థాయిలో ప్రోత్సాహకాలు, రాయితీలు.. గ్రేడ్ బి భవనాలకు అందులో సగం మేర ఇస్తారు. సంప్రదాయ భవనాలతో పోలిస్తే.. నీరు, ఇంధనాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ సహజ వనరులను పరిరక్షిస్తూ, తక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తూ, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించే భవనాలను హరిత భవనాలుగా పేర్కొంటున్నారు. వీటిలో ప్రతి అంశాన్నీ పరిశీలించిన తర్వాత ప్రోత్సహకాలు, రాయితీలు ఎంత ఇవ్వాలనేది నిర్ణయిస్తారు.