విశాఖలో లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఎల్ఆర్ఎస్ కింద వచ్చిన వేలాది దరఖాస్తులను విశాఖపట్నం మెట్రొపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ (వీఎంఆర్డీఏ) ఇంకా పరిష్కరించలేదు. ఇప్పటివరకు దాదాపు 4400కి పైగా దరఖాస్తులు వచ్చాయి. కొన్ని దరఖాస్తులు అసంపూర్తిగా ఉండటం వల్ల వాటి పరిశీలనలో అవాంతరాలు ఎదురవుతున్నాయని వీఎంఆర్డీఏ చెబుతోంది.
అయితే, దరఖాస్తుల పరిశీలనలో తీవ్ర జాప్యం జరుగుతోందని, తరచుగా వాటిని తోసిపుచ్చుతున్నారని కొందరు దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం అనుమతి పొందిన లేఔట్లలో ఎకరానికి 60 సెంట్ల స్థలంలో ప్లాట్లు వేయొచ్చు. కానీ కొందరు డెవలపర్లు అక్రమంగా 80 సెంట్ల స్థలంలో ప్లాట్లు వేస్తున్నారు. భూమి విలువ, పరిమాణాన్ని బట్టి పీనలైజేషన్ చార్జీలు నిర్ధారిస్తారని అధికారులు తెలిపారు. 2019 ఆగస్టు 31 నాటికి ఉన్న మార్కెట్ రేట్ల ఆధారంగా ఈ ఛార్జీలు లెక్కిస్తారని వివరించారు.