- బకాయిలపై జరిమానా తొలగింపు
- మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్ మేయర్ ప్రకటన
- మన రాష్ట్రంలోనూ అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు
ఆస్తిపన్ను చెల్లింపుదారులకు మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. నెలరోజులపాటు అభయ్ యోజన్ పథకం అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ పథకం కింద పన్ను చెల్లింపుదారులకు కొంత ఊరట లభించనుంది. ఇప్పటివరకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిలపై జరిమానా మొత్తాన్ని వంద శాతం తొలగిస్తారు. అంటే, కేవలం పన్ను ఎంత ఉందో అంతే చెల్లిస్తే సరిపోతుందన్న మాట.
ఉల్లాస్ నగర్ కార్పొరేషన్ కి ఆస్తిపన్ను ద్వారానే అధిక ఆదాయం సమకూరుతుంది. అయితే, కరోనా తదితర కారణాల వల్ల ఆస్తి పన్ను వసూలు సరిగా జరగకపోవడంతో సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో అభయ్ యోజన పథకం అమలు చేయడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చని భావిస్తున్నారు. జరిమానా మొత్తాన్ని మినహాయించడంతో ఆస్తిపన్ను చెల్లించడానికి పలువురు ముందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. కాగా, ఇలాంటి పథకాన్ని మన రాష్ట్రంలోనూ.. ప్రధానంగా హైదరాబాద్ లో అమలు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.