- ఈసారి టైటిల్ స్పాన్సర్.. అపర్ణా కన్‌స్ట్రక్షన్స్
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రీ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అనేక సంస్థలు పోటీ పడ్డాయని.. నగరానికి చెందిన పలువురు డెవలపర్లు బడా స్టాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపెట్టారని తెలిసింది. గతంలో కంటే ఈసారి నిర్మాణ సంస్థల మధ్య పోటీ తీవ్రత పెరిగిందని అర్థమైంది. దీనికి కారణాల్ని విశ్లేషిస్తే.. ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రాపర్టీ షోలను ఎంతో పకడ్బందీగా, పక్కా ప్రణాళికలతో క్రెడాయ్ హైదరాబాద్ నిర్వహిస్తుందనే పేరుంది. సంస్థ నిర్వహించే ప్రచారం శైలి కూడా ఎంతో వినూత్నంగానే దర్శనమిస్తుంది. నగరంలో ఇళ్లను కొనాలని భావించేవారిని విశేషంగా ఆకర్షిస్తుంది. మూడు రోజుల్లో.. కనీసం ఒక్కరోజు అయినా వీలు చేసుకుని.. ప్రాపర్టీ షోకు వెళ్లాలనే ఆలోచన రేకెత్తించేలా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లను ఎంచుకునే వారి సంఖ్య తక్కువేం కాదు. అంతెందుకు, క్రితంసారి జరిగిన ప్రాపర్టీ షోలో.. భార్యాభర్తలతో పాటు అటుఇటు కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా విచ్చేసి ప్రాపర్టీలను ఎంచుకున్న విషయం తెలిసిందే.
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో అంటే చాలు.. ఇళ్ల కొనుగోలుదారులు ఎగబడతారు. అందుకే, గత ప్రాపర్టీ షోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రాపర్టీ షోకు విచ్చేసిన వారిలో చాలామంది అక్కడికక్కడే డీల్స్ క్లోజ్ చేశారు. కొంతమంది బయ్యర్లు హైటెక్స్ నుంచి ప్రాజెక్టులనూ సందర్శించారు. గత ప్రాపర్టీ షోకు వచ్చిన అనూహ్యమైన స్పందన కారణంగానే పలు నిర్మాణ దిగ్గజాలు బడా స్టాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపించాయి. ఈసారి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకు.. అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని తెలిసింది. మరి, మిగతా స్పాన్సర్ల జాబితాలో రాజపుష్ప ప్రాపర్టీస్, జనప్రియ ఇంజినీర్స్ సిండికేట్ వంటి సంస్థలున్నాయని సమాచారం. ఏదీఏమైనా, హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇళ్ల కొనుగోళ్ల పండగ షురూ అవ్వడంతో హోమ్ బయ్యర్లు, ఇన్వెస్టర్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను సందర్శించడానికి ఆసక్తిగా ఉన్నారని సమాచారం.