ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా (ఐటీపీఐ) తెలంగాణ ఛాప్టర్ ఛైర్మన్‌గా కొమ్ము విద్యాధర్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ డీటీసీపీ విభాగానికి సంచాలకులుగా, రెరా అథారిటీ సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా కొమ్ము విద్యాధర్ మాట్లాడుతూ.. పట్టణాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందటంలో టౌన్ ప్లానర్లు కృషి చేస్తారని తెలిపారు. నగరాల మాస్టర్ ప్లాన్లను రూపొందించే కీలకమైన బాధ్యతను టౌన్ ప్లానర్లు సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఐటీపీఐ తెలంగాణ ఛాప్టర్‌కి వరుసగా రెండోసారి ఛైర్మన్‌గా ఎన్నుకోవడంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ ఛాప్టర్‌ని మరింత బలోపేతం చేసి.. తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. సెక్రటరీగా కృష్ణప్రసాద్, ట్రెజరర్‌గా నర్సింహ రాములు, బిల్డింగ్ కమిటీ ఛైర్మన్‌గా సత్యనారాయణమూర్తి తదితరులు ఆఫీస్ బేరర్లుగా ఎన్నికయ్యారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఐటీపీఐ తెలంగాణ ఛాప్టర్‌లో నాలుగు వందల మంది టౌన్ ప్లానర్లు సభ్యులుగా ఉన్నారు.