- నరెడ్కో ట్రెడా అధ్యక్షుడు సునీల్ చంద్రారెడ్డి ఆవేదన
రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో కూరుకుందని పలు మీడియా ఛానళ్లు చేస్తున్న ప్రచారం వల్ల అటు బిల్డర్లు.. ఇటు కొనుగోలుదారులు అయోమయంలో పడిపోతున్నారని ట్రెడా అధ్యక్షుడు సునీల్ చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మియాపూర్‌లో జరిగిన నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శి మేక శివరాం ప్రసాద్, వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ సత్యం శ్రీరంగం, ప్రధానకార్యదర్శి ఎం. ప్రేమకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. సిమెంటు, స్టీలు రేట్లు పెరగడం వల్ల నిర్మాణ వ్యయం సుమారు ముప్పయ్ శాతం అధికమైందని తెలిపారు. ఒకవైపు మార్కెట్ విలువల్ని పెంచి.. మరోవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేశారని.. ఇంకోవైపు జీఎస్టీ, ఆదాయ పన్ను వంటివి కడుతున్నామని తెలిపారు. ఇలా డబుల్ ట్యాక్సేషన్ వల్ల నిర్మాణ రంగం తీవ్ర అవస్థలు పడుతుందన్నారు. ఇప్పటికైనా పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
111 జీవో ఎత్తేయడం వల్ల మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కోదని.. ఒకేసారి వేల ఎకరాల భూమి వినియోగంలోకి రాదనే విషయాన్ని గుర్తు చేశారు. కాబట్టి, ఈ విషయంలో బిల్డర్లు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఉపాధక్షులు కేవీ ప్రసాదరావు, డి. కోటేశ్వరావు, బి. లక్ష్మీనారాయణ, బసంత్ కుల్దీప్, కొర్రపాటి సుభాష్, లక్ష్మీపతి రాజు, రామ్ కుమార్, నరేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.