ఎప్పుడో పదేళ్లకు పైగా పాత ఫ్లాట్లు. ఎండకు ఎండాయి.. వానకు తడిచాయి.. స్ట్రక్చర్ ఎంత నాణ్యతగా ఉందో తెలియదు.. రేటు తక్కువని తీరా గృహప్రవేశం చేశాక.. శ్లాబులు కారితే.. బాత్రూముల నుంచి లీకేజీలు ఏర్పడితే బాధ్యత ఎవరిది? వాటికి మరమ్మతులు చేయించేదెవరు? అంత పెద్ద అపార్టుమెంటులో సెక్యూరిటీని ఎవరు మానిటర్ చేస్తారు? మొత్తం మెయింటనెన్స్ ఎవరు చూస్తారు?
ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చెబుతూ.. హౌసింగ్ బోర్డు బండ్లగూడ, పోచారంలో ఫ్లాట్లను అమ్మితే ఉత్తమం అని ప్రజలు భావిస్తున్నారు. మార్కెట్ రేటు కంటే కొంచెం తక్కువకే ఫ్లాట్ల ధరను నిర్ణయించినా.. తీరా కొన్నతర్వాత వాటి మెయింటనెన్స్ ఎవరు చేస్తారనే సందేహం కొనుగోలుదారుల్ని పట్టి పీడిస్తోంది. అందుకే, చాలామంది వీటిలో కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. మరి, ఇవి హాట్ కేకుల్లా అమ్ముడవ్వాలంటే ఏం చేయాలి?
రేటు తక్కువే.. కానీ!
అధికారుల లెక్కల ప్రకారం.. బండ్లగూడలో 1501 ఫాట్లు అమ్మకానికి ఉన్నాయి. ఇందులో నిర్మాణ పనులన్నీ పూర్తయినవి దాదాపు 419 ఫ్లాట్లు ఉన్నాయని సమాచారం. అంటే, అలా కొనగానే ఇలా ఇంటీరియర్స్ చేసుకోవచ్చన్నమాట. వీటి ధర చదరపు అడుక్కీ రూ.3,000 చెబుతున్నారు. మిగతావి చదరపు అడుక్కీ రూ.2,750 చొప్పున విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి మోడల్ హౌజ్ కూడా సిద్ధం చేస్తారు. అయితే, కొనుగోలుదారులు అలా చూసిన వెంటనే అక్కడికక్కడే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాటు చేయాలి. ఆన్‌లైన్‌లో లేదా మీ సేవలో బుక్ చేసుకోవాలంటే చాలామంది చేసుకోలేరు. కాబట్టి, ప్రభుత్వ అధికారులు అక్కడికక్కడే బుకింగ్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాలి.
- పదివేను వందల ఫ్లాట్లు.. దాదాపు అన్నీ బహుళ అంతస్తుల ఫ్లాట్లే.. ప్రతి టవరులో లిఫ్టు తప్పనిసరిగా ఉండాల్సిందే. మరి, ఆయా లిఫ్టుల మెయింటనెన్స్ ఎవరు చేస్తారు?
- విశాలమైన విస్తీర్ణంలో కట్టిన అపార్టుమెంట్లు కాబట్టి, పచ్చదనానికి పెద్దపీట వేశారు. మరి, ఈ పచ్చదనాన్ని క్రమం తప్పకుండా ఎవరు మెయింటెయిన్ చేయాలి?
- అపార్టుమెంట్ కొన్న తర్వాత.. అందులో నివసించేవారికి నిర్వహణపరంగా రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. వాటికి తక్షణమే పరిష్కరించాల్సి ఉంటుంది. మరి, ఆయా సేవల్ని ఎవరు అందజేస్తారు? ప్రభుత్వ అధికారులు లేదా సిబ్బంది నిర్వహణ బాధ్యతల్ని చూస్తే అంతే సంగతులు. కాబట్టి, ఈ సేవల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారా? అనే అంశం గురించి హౌసింగ్ బోర్డు కొనుగోలుదారులకు స్పష్టత నివ్వాలి. అప్పుడే, అధిక శాతం మంది ప్రజలు వీటిలో కొనేందుకు ముందుకొస్తారు.
స్పాట్ సేల్..
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్ముడవ్వాలంటే.. అక్కడికక్కడే స్పాట్ బుకింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు అక్కడే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించాలి. అంతేతప్ప, ముందు దరఖాస్తు చేసుకోండి.. ఆతర్వాత లాటరీ తీస్తామంటే.. కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపెట్టకపోవచ్చు. ఎందుకంటే, చాలామందికి మీ సేవ లేదా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేయడమే రాదు. అక్కడికెళ్లి లైన్లో నిల్చోని.. దరఖాస్తు చేయాలంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అందుకే, మోడల్ ఫ్లాట్ చూసిన వెంటనే అక్కడే ఫ్లాట్ కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించాలి. వీలైతే కొనుగోలుదారులు ఇరవై శాతం సొమ్ము అక్కడే చెల్లించేలా ఏర్పాటు చేయాలి. పలువురు బ్యాంకర్లతో ఒప్పందం కుదుర్చుకుని అక్కడే రుణ సదుపాయాల్ని కల్పించాలి. ఇలా చేస్తే.. ఎవరికి ఫ్లాటు నచ్చుతుందో వాళ్లు వెంటనే కొనుగోలు చేయడానికి ఉంటుంది.