- ఇళ్ల ధరలు, వడ్డీ రేట్లు పెరిగినా కనిపించని ప్రభావం
అటు ప్రాపర్టీ ధరలు, ఇటు వడ్డీ రేట్లు పెరిగినా ఇళ్ల డిమాండ్ లో ఎలాంటి మార్పూ లేదని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది. ముంబైతో పాటు ఢిల్లీ, బెంగళూరు, పుణె, కోల్ కతా, హైదరాబాద్ లలో ప్రాపర్టీ డిమాండ్ యథాతథంగానే ఉందని, పైగా 5 నుంచి 10 శాతం మేర వృద్ధి కనిపిస్తోందని పేర్కొంది.
కరోనా అనంతరం రియల్ రంగం కోలుకుని గాడిన పడిందని.. ఫలితంగా 2022లో ఈ రంగంలో చెప్పుకోదగ్గ వృద్ధి నమోదైందని వివరించింది. అయితే, 2016 నుంచి 2021 మధ్యకాలంతో పోలిస్తే 2022 తొలి అర్ధభాగంలో 20 శాతం మేర పెరుగుదల కనిపించగా.. రెండో అర్ధభాగంలో కాస్త తగ్గుదల కనిపించిందని తెలిపింది. అధిక క్యాపిటల్ వాల్యూతోపాటు వడ్డీ రేట్లు పెరగడం, స్టాంప్ డ్యూటీ అధికం కావడం వంటివి ఇందుకు కారణాలని పేర్కొంది. ‘దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 6 శాతం నుంచి 10 శాతం మేర పెరిగే అవకాశం కనిపిస్తోంది.
మెటీరియల్ ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. త్రైమాసికానికి రెండు శాతం చొప్పున ఇప్పటికే కొందరు ధరలు పెంచుతూ వెళ్తున్నారు. అలాగే భూముల ధరలు పెరగడం కూడా దీనిపై ప్రభావం చూపిస్తోంది. అయితే, ఈ ధరలు పెరిగినా.. పట్టణీకరణ తదితరాల కారణాల వల్ల హౌసింగ్ డిమాండ్ 5 శాతం నుచి 10 శాతం మేర పెరిగే అవకాశం కనిపిస్తోంది’ అని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ అనికేత్ దని పేర్కొన్నారు.