-
ఆందోళనలో కొనుగోలుదారులు
రియల్ ఎస్టేట్ డెవలపర్ మహిర హోమ్స్ లైసెన్స్ ను రద్దు చేస్తూ డీటీసీపీ తీసుకున్న నిర్ణయంతో 1500 మందికి పైగా కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. వీరిలో చాలామంది వంద శాతం చెల్లింపు చేసి ఫ్లాట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, సదరు కంపెనీ తప్పుడు పత్రాలు, నకిలీ బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసిందని తెలియడంతో డీటీసీపీ మహిర హోమ్స్ ప్రాజెక్టు లైసెన్స్ రద్దు చేసింది. అంతేకాకుండా ఆ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, కొనుగోలుదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తోంది.
ప్రాజెక్టు లైసెన్స్ రద్దుతో తీవ్రంగా ఆందోళన చెందుతన్న కొనుగోలుదారులు.. నకిలీ పత్రాలను సరిగా పరిశీలించకుండా అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. గుర్గావ్ సెక్టార్ 68లోని 10 ఎకరాల స్థలంలో మహిర ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో సాయి అసీనా ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్) ఓ ప్రాజెక్టు చేపట్టింది. దీనికి 2017లో డీటీసీపీ అనుమతి ఇచ్చింది. అయితే, డెవలపర్ అక్రమాలకు వ్యతిరేకంగా పలు ఫిర్యాదులు రావడంతో 2020లో డీటీసీపీ విచారణ ప్రారంభించింది. ఇందులో అక్రమాలు నిర్ధారణ కావడంతో ప్రాజెక్టు లైసెన్స్ రద్దు చేసింది. అదే సమయంలో కొనుగోలుదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసేందుకు ప్రాజెక్టును స్వయంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. కొనుగోలుదారులు 15 రోజుల్లోగా అన్ని పత్రాలతో తమను సంప్రదించాలని సూచించింది.