కొందరు డెవలపర్లు ఎంతకు బరితెగించారంటే.. మంత్రి కేటీఆర్ సూచనల్ని సైతం పెడచెవిన పెడుతున్నారు. ఇటీవల క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పాల్గొన్న ఆయన బిల్డర్లు అత్యాశకు పోవద్దని సూచించారు. ప్రీలాంచ్ ప్రాజెక్టులు చేపట్టొద్దన్నారు. ఆయన చెప్పి రెండు వారాలు కూడా కాలేదు.. అప్పుడే ఒక సంస్థ ప్రీలాంచ్ ప్రకటనను విడుదల చేసింది.
ఎంతో తెలివిగా తమ ప్రాజెక్టు వివరాల్ని అందిస్తూనే.. ప్రస్తుతం ఫ్లాట్ బుక్ చేసుకుని రెరా వచ్చిన తర్వాత సొమ్ము కట్టమని సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన చూసి కొందరు బిల్డర్లు షాక్ అయ్యారు. తమ అనుమతి తీసుకోకుండా.. అసలు ప్రాజెక్టు గురించి ఎక్కడా ప్రకటన చేయకూడదని తెలంగాణ రెరా అథారిటీ చెబుతున్నా కొన్ని సంస్థలు పెడచెవిన పెడుతున్నాయి. మరి, ఇలాంటి సంస్థలపై రెరా స్పందిస్తుందా? చూసీ చూడనట్లు వదిలేస్తుందా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
హైదరాబాద్‌లో ప్రప్రథమ స్కై డెక్ అపార్టుమెంట్స్ ప్రాజెక్టు రాయదుర్గంలో వస్తోందట. వినడానికి ఎంతో ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఏదో ఒక స్పెషల్ ఫీచర్ ఉంటే తప్ప బయ్యర్లు ముందుకు రారని అర్థం చేసుకున్న ఈ సంస్థ ఇలాంటి వినూత్న ప్రయోగం చేసిందని అర్థమవుతోంది. సుమారు ఏడు ఎకరాల విస్తీర్ణంలో 45 అంతస్తులవి మూడు టవర్లను నిర్మిస్తారట. ప్రాజెక్టు ఎలివేషన్, డిజైన్ భలే ఆకర్షణీయంగా ఉంది అచ్చం తెల్లాపూర్‌లోని ఏలియెన్స్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్టు తరహాలో!
ఫ్లోరుకు కేవలం నాలుగు ఫ్లాట్లే డిజైన్ చేసిన ఇలాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్టును.. ఎంచక్కా తెలంగాణ రెరా అథారిటీ అనుమతితో ప్రకటించొచ్చు కదా! ఇంత హడావిడిగా ప్రకటించాల్సిన అవసరమేముంది? పాశ్చాత్య దేశాల తరహాలో స్కై డెక్‌ను సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేయడం ఆసక్తి కలిగించే అంశమే. కాకపోతే, జీహెచ్ఎంసీ మరియు రెరా అథారిటీల నుంచి అనుమతి తీసుకున్నాక ప్రకటిస్తే.. ఈ ప్రాజెక్టుకు మంచి సానుకూల ప్రచారం లభించేది. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్లుగా.. ఇలా హడావిడిగా ఇంత మంచి ప్రాజెక్టును ప్రకటించడమే కరెక్టు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.