అనుమతులు తెచ్చుకోవడం కోసం అక్రమాలకు పాల్పడిన మహిర హోమ్స్ లైసెన్స్ రద్దు చేసిన డీటీసీపీ అధికారులు తాజాగా మరో రెండు సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. గురుగ్రామ్ లోని 63ఏ, 95, 103, 104 సెక్టార్లలోని నాలుగు హౌసింగ్ ప్రాజెక్టుల అనుతులు కోసం తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన మహిర బిల్డ్ టెక్, సీజార్ బిల్డ్ వెల్ సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు.
ఈ రెండు సంస్థలు తమ ప్రాజెక్టులకు అనుమతుల కోసం నకిలీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించడంతోపాటు బ్యాంకు అధికారులు సంతకాలు ఫోర్జరీ చేశారని డీటీసీపీ డైరెక్టర్ కేఎం పాండురంగ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలకు, వాటి డైరెక్టర్లకు భవిష్యత్తులో ఎలాంటి అనుమతులూ ఇచ్చేది లేదని స్పష్టంచేశారు. 63ఏ సెక్టార్ లోని ప్రాజెక్టు కోసం సీజార్ బిల్డ్ వెల్, మిగిలిన మూడు ప్రాజెక్టుల కోసం మహిర బిల్డ్ టెక్ కంపెనీలు నకిలీ డాక్యుమెంట్లు, బ్యాంకు గ్యారెంటీలు సమర్పించి లైసెన్సులు పొందినట్టు వివరించారు. ఇప్పటికే సెక్టార్ 68లో చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టు కోసం నకిలీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించినట్టు తేలడంతో మహిర ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో సాయి అసీనా ఫార్మ్స్ లిమిటెడ్) పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.