- ఎన్నారైల కొనుగోళ్లతో భారత రియల్ రంగంలో జోష్
ప్రపంచ పరిణామాల నేపథ్యంలో డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గుతుండటంతో ఎన్నారైల చూపు దేశంలోని రియల్ రంగం వైపు మళ్లుతోంది. దీంతో ఎన్నారైల రియల్ కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యతరహా ఆదాయం తెచ్చే ప్రాజెక్టుల నుంచి ప్రీమియం, లగ్జరీ సెగ్మెంట్ల వరకు వారు ఆసక్తి చూపిస్తున్నారు. 2022లో ఇప్పటివరకు భారత కరెన్సీ అమెరికా డాలర్ తో పోలిస్తే 5.2 శాతం మేర క్షీణించింది.
‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. కానీ భారత్ మాత్రం ఆర్థిక వృద్ధిపరంగా సురక్షితమైన ప్రస్తానంలో కొనసాగుతోంది’ అని నరెడ్కో వైస్ చైర్మన్, హీరానందని గ్రూప్ ఎండీ నిరంజన్ హీరానందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారతీయ రియల్ రంగం ఎన్నారైలకు మంచి ఆప్షన్ గా మారిందని వివరించారు. అనిశ్చితి పరిస్థితుల్లో సైతం భారత రియల్ రంగం పెట్టుబడి విలువ పెరగడానికి, అద్దె ఆదాయం రావడానికి బాగా తోడ్పడుతోందన్నారు. దీంతో మన రియల్ పరిశ్రమ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారిందని పేర్కొన్నారు.
గత కొన్ని నెలల్లో ప్రాపర్టీల అమ్మకాలు పెరగడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘రూపాయి మారక విలువ తగ్గడంతో ఎన్నారైలంతా భారత రియల్ రంగం వైపు చూస్తున్నారు. ఫలితంగా ఇక్కడ కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి’ అని కె.రహేజా కార్ప్ హోమ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రమేష్ రంగనాథన్ తెలిపారు. రెరా, డిజిటైజేషన్ వంటి సంస్కరణలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని వివరించారు. అమెరికా, బ్రిటన్, సింగపూర్, హాంకాంగ్, మాల్టా వంటి దేశాల్లో ఉంటున్న ఎన్నారైలే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు.