poulomi avante poulomi avante

ముంబైలో సూప‌ర్ హిట్‌.. తెలంగాణ‌లో అట్ట‌ర్ ఫ్లాఫ్‌!

  • రెరా అథారిటీ నిర్వ‌హ‌ణ‌లో మ‌నం బేకార్‌!
  • మనకంటే మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ బెటర్..
  • రెరా అథారిటీని బ‌లోపేతం చేయాలి
  • మన రెరా దేశానికే దిక్సూచీ కావాలి!
  • సీఎం తల్చుకుంటే ఇది కష్టమేం కాదు

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌: తెలంగాణ మోడ‌ల్‌ను దేశ‌మంత‌టా వ‌ర్తింప‌జేయాల‌ని భావిస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం.. రెరా అథారిటీని బ‌లోపేతం చేయ‌కుండా.. ప‌టిష్ఠంగా అమ‌లు చేయ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని.. బ‌య్య‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, ఎన్‌సీఆర్‌, క‌ర్ణాట‌క వంటి రాష్ట్రాల్లో రెరా అథారిటీ కొనుగోలుదారుల స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రిస్తోంది. క‌ష్టార్జితంతో ఇళ్లు కొన్న‌వారి సొమ్మును వెన‌క్కి ఇప్పించేందుకు కృషి చేస్తోంది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా ఉంది ప‌రిస్థితి.

ts rera

2018 ఆగ‌స్టులో.. మన రాష్ట్రంలో రెరా అథారిటిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్ప‌టి సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి రాజేశ్వ‌ర్ తివారీ ఉన్నంత వ‌ర‌కూ.. రెరా కార్య‌క‌లాపాలు చురుగ్గానే ఉండేవి. ఇల్లు కొనుగోలు స‌మ‌యంలో బయ్యర్లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న తెచ్చారు. అప్పట్నుంచి యాభై శాతానికి పైగా ఇళ్ల కొనుగోలుదారులు రెరా అనుమ‌తి ఉంటేనే ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల‌ను కొనేవారు. ఈ రంగం మీదే ఆధార‌ప‌డ్డ ప్రొఫెష‌న‌ల్ బిల్డ‌ర్లు.. రెరా తీసుకున్నాకే ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించేవారు. అమ్మ‌కానికి పెట్టేవారు. ఆయ‌న ప‌ద‌వీవిర‌మ‌ణ త‌ర్వాత అప్ప‌టి వాణిజ్య ప‌న్నుల ముఖ్య కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్‌కు రెరా అద‌న‌పు బాధ్య‌త‌ల్ని అప్ప‌గించారు.

ఆత‌ర్వాత కాల‌క్ర‌మంలో ఆయ‌నే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కావ‌డంతో.. రెరా అథారిటీపై ఫోకస్ తగ్గింది. రాష్ట్రాన్ని చ‌క్క బెట్టే బాధ్య‌త భుజ‌స్కంధాల మీద ఉన్న‌ప్పుడు.. రెరా అథారిటీని ప‌ట్టించుకోవ‌డానికి తీరిక పెద్దగా ఉండదు కదా! అందుకే, నేటికీ రెరాకు సంబంధించి అప్పీలేట్ ట్రిబ్యున‌ల్ కూడా ఏర్పాటు కాలేదు. ఈ విష‌యం సీఎం కేసీఆర్ దృష్టి సారించ‌క‌పోవ‌డంతో.. తెలంగాణ‌లో రియ‌ల్ సంస్థ‌ల మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే, మ‌న రాష్ట్రంలో రెరా అథారిటీ మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కేవ‌లం స‌మస్య‌ల‌పై స్పందించకుండా.. ఆయా స‌మ‌స్య‌లు పున‌రావృతం కాకుండా చురుగ్గా వ్య‌వ‌హ‌రించాలి. అప్పుడే, రెరాపై కొనుగోలుదారుల్లో మ‌రింత న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది.
క‌ష్టార్జితాన్ని ప‌ణంగా పెట్టిన కొనుగోలుదారుల్ని కొంద‌రు బిల్డ‌ర్లు మోసం చేస్తున్నార‌నే విష‌యం కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అవ‌గ‌త‌మైంది. అందుకే, సుప్రీం కోర్టుతో పాటు ఇత‌ర న్యాయ ఫోర‌మ్‌ల‌లో కూడా.. ఇళ్ల కొనుగోలుదారుల ప‌క్షాన అనేక తీర్పులు వెలువ‌డ్డాయి. న్యూటెక్ ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో సుప్రీంకోర్టు కీల‌క‌మైన నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. రిఫండ్‌, వ‌డ్డీ మ‌రియు జ‌రిమానాను విధించే అధికారం రెరా రెగ్యులేట‌రీ అథారిటీకి ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. ప‌రిహారం వ‌సూలు చేసే అధికారం న్యాయ‌నిర్ణేత అధికారికి ఉంద‌ని పేర్కొంది. ఫిర్యాదుల్ని వినడానికి రెగ్యులేటరీ అథారిటీ తన అధికారాలను ఒకే సభ్యునికి అప్పగించవచ్చని కూడా పేర్కొంది. అప్పీళ్ల కోసం సెక్షన్ 43(5) ప్రకారం డిపాజిట్ యొక్క ముందస్తు షరతులు భారత రాజ్యాంగం ప్ర‌కారం వ‌ర్తిస్తాయ‌ని తెలియ‌జేసింది. మొత్తానికి, ఒకే దెబ్బ‌కు ల‌క్ష‌లాది మంది గృహ కొనుగోలుదారుల‌కు అధికారం ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లో కొనుగోలుదారుల డబ్బు వాపసుకు సంబంధించిన కేసులో అలహాబాద్ హైకోర్టు జిల్లా మెజిస్ట్రేట్‌ను కోర్టుకు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. దీంతో, గృహ కొనుగోలుదారులు జీవిత పొదుపును తిరిగి పొందగ‌లిగారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ కేసులో రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్లపై రెరా అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది. మరొక కేసులో రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన‌ అన్ని బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లో రెరా ఆదేశాలను పాటించనందుకు తొమ్మిది మంది బిల్డర్లపై రూ.1.40 కోట్ల జరిమానా విధించింది. మహారాష్ట్రలో ఫ్లాట్‌ను స్వాధీనం చేసేటంత వ‌ర‌కూ ప్రతిరోజూ రూ. 10,000 చెల్లించాలని మహా రెరా బిల్డర్‌ను ఆదేశించింది. ఇలాంటి నిర్ణ‌యాల్ని చూస్తుంటే.. ఇత‌ర రాష్ట్రాల్లో రెరా ఎంత ప‌క‌డ్బందీగా ప‌ని చేస్తుందో అర్థ‌మ‌వుతోంది. అక్క‌డి ఇళ్ల‌ కొనుగోలుదారులు ఎంత ధీమాగా ఉన్నారో అర్థ‌మ‌వుతోంది.
తెలంగాణలో కొంత‌కాలం.. రెరాలో ప్రాజెక్టు మరియు ఏజెంట్ న‌మోదు ప్ర‌క్రియ విజ‌య‌వంతం అయ్యింది. ఇందుకోసం సుమారు రెండేళ్లు ప‌ట్టింది. కాక‌పోతే, ఇళ్ల కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లే మ‌న వ‌ద్ద‌ ప‌రిష్కారం కావ‌ట్లేదు. ఫ‌లితంగా, అనేక మంది బ‌య్య‌ర్లు రెరా ఆఫీసుకు వ‌చ్చి ఫిర్యాదు చేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌ట్లేదు. కాబ‌ట్టి, ఇప్ప‌టికైనా రెరాను పూర్తి స్థాయిలో బ‌లోపేతం చేయాలి. లేక‌పోతే, జాతీయ స్థాయిలో ఈ అంశం లేవ‌నెత్తితే.. మ‌నం త‌ల‌దించుకోవాల్సి వ‌స్తోంది. ఆ దుస్థితి రాకుండా ఉండాలంటే.. తెలంగాణ‌లో రెరాను పూర్తి స్థాయిలో బ‌లోపేతం చేయాలి.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles