దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల్ని గమనిస్తే.. అక్కడి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం వల్ల.. మల్టీ మోడల్ కారిడార్లను ఏర్పాటు చేయడం ద్వారా.. ఆ దేశాల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మారిపోయింది. మన భారతదేశమూ ఇదే విధమైన ఆర్థిక మార్గంలో పయనిస్తోంది. గతి శక్తి కార్యక్రమం ద్వారా మల్టీ మోడల్ కనెక్టివిటీని మెరుగుపర్చడానికి ప్రయత్నాల్ని ఆరంభించింది. రైల్వేలు, రోడ్లు, ఓడరేవులు, జలమార్గాల్ని వృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మల్టీమోడల్ కారిడార్ల వల్ల ఎలాంటి అంతరాయం లేకుండా రాకపోకలు జరుగుతాయి. ప్రజలు, వస్తువులు, సేవల తరలింపు వంటివి సులువుగా జరుగుతాయి. ఇటీవల జాతీయ రహదారుల సంస్థ ఐదు రోజుల్లో 75 కిలోమీటర్లు వేసి గిన్నిస్ రికార్డును నెలకొల్పింది. 2022 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 10,457 కిలోమీటర్లను అభివృద్ధి చేసింది.
భారత ఆర్థిక వ్యవస్థ ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుని.. 2023 ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం, 2024లో 7.1 శాతం వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ యొక్క స్వాభావిక బలం, అనుకూలమైన వాతావరణం వృద్ధిని కొనసాగించే అవకాశముంది.
మౌలిక సదుపాయాలపై ప్రధాన దృష్టి సారించడం వల్ల పారిశ్రామిక, గిడ్డంగుల రంగం వృద్ధి చెందుతుంది.
- 2021లో 38 బిలియన్ డాలర్లు గల భారత ఈ-కామర్స్ విభాగం.. 2026 నాటికల్లా 120 బిలియన్లకు చేరే అవకాశముంది.
- క్యాష్ అండ్ క్యారీ, సింగిల్ బ్రాండ్ రిటైల్ సెగ్మంట్లలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని అనుమతించారు. మల్టీ బ్రాండ్ రిటైల్ విభాగంలో 51 శాతం అనుమతించడంతో ఈ కామర్స్ విభాగాలు గణనీయంగా వృద్ధి చెందుతాయి.
- 2020లో 46 బిలియన్ డాలర్లు గల ఈ కామర్స్ విభాగం.. 2030 నాటికి 350 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశమున్నది.
- ఈకామర్స్, రిటైల్ రంగాలు వృద్ధి చెందడానికి వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ విభాగాలు ముఖ్యభూమికను పోషిస్తాయి. 2020లో 705 బిలియన్ డాలర్లు గల ఈ రంగం.. 2030 నాటికి 1.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.
1.4 ట్రిలియన్ డాలర్లు..
- గతి శక్తి కార్యక్రమం ద్వారా 1.4 ట్రిలియన్ డాలర్లను భారత్ ఖర్చు చేస్తోంది.
- 2020- 2025 మధ్య.. దేశవ్యాప్తగా ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడానికి 1.5 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది.
- నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైపులైన్ ద్వారా 6,835 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.