వర్షాకాలం వచ్చేసింది. వానలు దంచి కొడుతున్నాయి. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ రోడ్లు ఎలా మారతాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటిది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నిత్యం జనాలకు నరకం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాన నీటిని ఒడిసిపట్టి నిల్వ చేయాలనే కనీస ఆలోచన కూడా మన అధికారులకు రాకపోవడం గమనార్హం.
వాస్తవానికి ప్రతి నిర్మాణంలోనూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇలా వాననీటి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ భూమిలోకి ఇంకిపోతుంది. ఫలితంగా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా రోడ్లపై నీరు వృథాగా పోకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశంలో అనేక మున్సిపల్ కార్పొరేషన్లు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా గణాంకాల్ని గమనిస్తే.. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లో మన జీహెచ్ఎంసీ ఏ స్థాయిలో ఉంది? ఎన్ని నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నాయి? అసలు డెవలపర్లు ఏర్పాటు చేస్తున్నారా.. లేదా అనే విషయాలను ఎవరు పరిశీలిస్తున్నారు అనేది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈ అంశాలపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. అంతేకాకుండా వ్యక్తిగత ఇళ్లను నిర్మిస్తున్నవారు వీటిని ఏర్పాటు చేస్తున్నారా లేదా అనే విషయాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచిస్తున్నారు.