- 15.6 లక్షల ఇళ్లకు ఇంధన సామర్థ్య ఉపకరణాలు
ఏపీలో విద్యుత్ ఆదా కోసం ప్రభుత్వం కొత్త పథకం తీసుకొస్తోంది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇంధన సామర్థ్యంతో కూడిన గృహోపకరణాలను అందజేసేందుకు చర్యలు తీసుకోనుంది. తద్వారా ఏటా రూ.350 కోట్ల విలువైన విద్యుత్ ఆదా అవుతుందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న కాలనీల్లో నిర్మించే ఇళ్లలో ఈ పథకం వర్తింపజేయనున్నారు. మొదటిదశలో నిర్మించే 15.6 లక్షల ఇళ్లకు విద్యుత్ పొదుపు చేయగల గృహోపకరణాలను మార్కెట్ ధర కంటే తక్కువకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతి లబ్ధిదారుడికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, రెండు ఇంధన సామర్థ్య ఫాన్లు ఇస్తారు. మార్కెట్ ధరతో పోలిస్తే 30 నుంచి 35 శాతం తక్కువకు వీటిని అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే లబ్ధిదారులకే వీటిని ఇస్తామని జైన్ పేర్కొన్నారు. ఈ ఉపకరణాలను వినియోగించడం వల్ల ఒక్కో ఇంటికి ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు.