- అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సిడ్కో ఘనత
ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు.. ఎంత చిన్న ఇల్లైనా సరే కనీసం రెండు మూడు నెలల సమయమైనా పడుతుంది. అలాంటిది సిడ్కో మాత్రం 12 అంతస్తుల భవనాన్ని కేవలం 96 రోజుల్లోనే నిర్మించి ఔరా అనిపించింది. మిషన్ 96 కింద నిర్మించిన ఈ భవనంలో 96 ఫ్లాట్లు ఉన్నాయి. నవీ ముంబైలోని బామన్ డోంగ్రిలో ఈ ఏడాది ఏప్రిల్ 4న నిర్మాణాన్ని ప్రారంభించి జూలై 9న పూర్తి చేసింది. ఎల్ అండ్ టీ సంస్థ అడ్వాన్స్డ్ ప్రికాస్ట్ టెక్నాలజీ సహాయంతో ఈ నిర్మాణం పూర్తి చేసింది.
‘ఫ్యాక్టరీ నియంత్రిత వాతావరణంలో సుపీరియర్ క్వాలిటీతో ప్రికాస్ట్ టెక్నాలజీ సహాయంతో మిషన్ 96 పూర్తి చేశాం. దీనివల్ల తక్కువ మంది పనివాళ్లతో తక్కువ సమయంలోనూ నిర్మాణం చేయొచ్చు’ సిడ్కో వీసీ అండ్ ఎండీ డాక్టర్ సంజయ్ ముఖర్జీ పేర్కొన్నారు. 64వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన మిషన్ 96లో మొత్తం 1985 ప్రికాస్ట్ ఎలిమెంట్స్ వినియోగించారు. వీటితోపాటు ఆర్కిటెక్చరల్ ఫినిషింగులు, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులు పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పురోగతిని కన్ స్ట్రక్షన్, డిజిటిల్ టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించారు.