ఫ్లాట్ కొనుగోలుదారులను రూ.6.17 కోట్ల మేర మోసం చేసిన కేసులో ముంబై ఆర్థిక నేరాల విభాగం ఘట్కోపర్ కు చెందిన శ్రీనాథ్ డెవలపర్స్ డైరెక్టర్ నీరజ్ వేద్ (54) ను అరెస్టు చేసింది. అతడి భార్య సప్నా వేద్ కోసం గాలిస్తోంది. ఆమె కూడా శ్రీనాథ్ డెవలపర్స్ డైరెక్టర్. వీరిద్దరిపై చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కేసులు నమోదయ్యాయి. గతవారమే చెల్లింపులు చేయనందుకు మహా రెరా సీజ్ చేసిన ఫ్లాట్ లోకి అక్రమంగా ప్రవేశించినందుకు నీరజ్ వేద్ పై తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
నీజర్ వేద్ 2010లో విహార్ లేక్ రోడ్డులో ఓ ప్రాజెక్టు రీడెవలప్ మెంట్ కోసం ఒప్పందం చేసుకున్నారు. ఆ భవనంలో ఉంటున్నవారిని మరోచోటకు తరలించి మిగిలిన ఫ్లాట్లను కొత్త కొనుగోలుదారులకు విక్రయించారు. నిబంధనల ప్రకారం 13 అంతస్తులు నిర్మించాల్సి ఉండగా.. వేద్ 16 అంతస్తులు నిర్మించారు. ఈ క్రమంలో అధికారులు పనులు నిలిపివేశారు.
ఈ నేపథ్యంలో ఇందులో ఆరు ఫ్లాట్లు, ఓ షాపును రూ.6.17 కోట్లకు కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులు నీరజ్ పై ఫిర్యాదు చేశారు. గడువు ముగిసినప్పటికీ తమకు ఫ్లాట్లు అప్పగించలేదని, వాటి కోసం అడిగితే ఇంకా డబ్బులు కట్టాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. అయితే, తమకు విక్రయించిన ఫ్లాట్లను అప్పటికే వేరే వాళ్లకు అమ్మేసిన సంగతి తమకు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో నీజర్ పై కేసు నమోదైంది.