నోయిడాలో అక్రమంగా నిర్మించిన సూపర్ టెక్ ట్విన్ టవర్ల కూల్చివేత ప్రక్రియ తుది అంకానికి చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ జంట టవర్లను కూల్చివేయానికి అవసరమైన ‘నో అబ్జక్షన్ సర్టిఫికెట్-ఎన్ఓసీ’ని పోలీసులు ఇచ్చేశారు. ఈ మేరకు గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు క్లియరెన్స్ ఇచ్చారు. ఇంకా సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సీబీఆర్ఐ) అనుమతి రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
సెక్టార్ 93ఏలో ఉన్న వంద మీటర్ల పొడవైన ఈ టవర్ల కూల్చివేతకు ఆగస్టు 21 మధ్యాహ్నం 2.30 గంటలకు ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం దాదాపు 3500 కేజీలకు పైగా పేలుడు పదార్థాలను ఈ భవనాల కాలమ్స్ లో 9400 రంధ్రాలు చేసి అమర్చారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సూపర్ టెక్ ట్విన్ టవర్ల కూల్చివేత కోసం ఎడిఫిస్ ఇంజనీరింగ్ సంస్థ ఎన్ఓసీ ఇవ్వాలని పోలీసులను కోరింది.
దీంతో సంబంధిత నిబంధనల మేరకు ఎన్ఓసీ ఇచ్చాం’ గౌతమ్ బుద్ధ నగర్ డీసీపీ రామ్ బదన్ సింగ్ తెలిపారు. కాగా, టవర్ల కూల్చివేత సమయంలో కనీసం అరగంటపాటు నోయిడా ఎక్స్ ప్రెస్ వేను మూసివేస్తారు. జంట భవనాల కూల్చివేతకు 15 నిమిషాల ముందు రెండు వైపులా ట్రాఫిక్ నిలిపివేస్తారు. భవనాల కూల్చివేత తర్వాత వచ్చే దుమ్ము పోవడానికి కనీసం మరో 15 నిమిషాల సమయం పడుతుందని భావిస్తున్నారు. అంతవరకు రెండు వైపుల నుంచీ ట్రాఫిక్ ను అనుమతించరు.